స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. భారత జట్టులో ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని నెలలుగా అతను జట్టులో లేకపోవడంతో అతని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఆ లోటును పూడ్చాలంటే బుమ్రా మళ్లీ గ్రౌండ్‌లోకి దిగాలి. అందుకోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లినట్లు సమాచారం.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై చాలా కాలం అయింది. ఆసియా కప్ 2022కు ముందు వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన బుమ్రా.. మధ్యలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో ఆ సిరీస్‌కే కాదు.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022కు సైతం బుమ్రా దూరమయ్యాడు. ఆ సమయంలో బుమ్రాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కీలక టోర్నీలకు ముందు గాయపడి జట్టుకు దూరం అవ్వడంపై క్రికెట్ అభిమానులు బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది.
ఆ టోర్నీలో టీమిండియా సెమీస్ వరకూ వెళ్లిన.. బ్యాటింగ్ బలంతోనే విజయాలు సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో మన బౌలింగ్ అసలు సత్తా బయటపడింది. 170కి పైగా పరుగులు టార్గెట్‌ను ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించిందంటేనే అర్థం చేసుకోవచ్చు మన బౌలింగ్ ఎటాక్ ఏ మేర ప్రభావం చూపించిందో. అంత దారుణంగా ఓడిన తర్వాత బుమ్రా లేకుంటే టీమిండియా బౌలింగ్ ఎటాక్ ఎంత వీక్‌గా ఉంటుందో తెలుసొచ్చింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కూడా గాయం నుంచి కోలుకుని బుమ్రా.. ఆ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగిన పలు సిరీస్‌లకు సైతం అందుబాటులో లేకుండా పోయాడు. అయితే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి బుమ్రా కచ్చితంగా అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ.. అది కూడా జరగలేదు. కనీసం చివరి రెండు టెస్టులకు బుమ్రా జట్టులో ఉంటాడని సాక్ష్యత్తు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రకటించినా.. బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రాను ఇబ్బంది పెట్టదల్చుకోలేదని, అతనికి కావాల్సినంత రెస్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.
అయితే బుమ్రా ఐపీఎల్‌కు సిద్ధం అవుతున్నాడు. ఐపీఎల్‌లో బరిలోకి దిగుతాడు అనే వార్తలు రాగానే క్రికెట్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. జాతీయ జట్టుకు ఆడమంటే గాయమనే బుమ్రా ఐపీఎల్ అనగానే పరిగెత్తుకుంటూ వస్తాడంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే.. బుమ్రా ఐపీఎల్‌కు సైతం దూరమైనట్లు తాజాగా తెలిసింది. వెన్ను సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం బుమ్రా శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకోసం న్యూజిలాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే బుమ్రాకు సర్జరీ జరగనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ నుంచి వచ్చిన తర్వాత బుమ్రా మళ్లీ గ్రౌండ్‌లోకి దిగే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.