ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి… ఆ అవార్డు గెలుచుకోవడం అంటే మాటలు కాదు, ప్రపంచ దేశాల మన్ననలు పొందడం. అలాంటి అరుదైన, అత్యున్నత గౌరవం ఈ ఏడాది భారత సంతతికి చెందిన ఒక గొప్ప మహిళను వరించింది. వర్ణవివక్షను ఎదిరించి, అణగారిన వర్గాల కోసం తన గొంతును ఎత్తిన మాజీ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ నవనీతమ్ పిళ్లైకి 2026 సంవత్సరానికి గాను ‘నోబెల్ శాంతి బహుమతి’ ప్రకటించారు.
నవనీతమ్ పిళ్లై చూడటానికి విదేశీయురాలిగా కనిపించినా… ఆమె మూలలు మన భారతదేశంలోనే ఉన్నాయి! ఆమె తల్లిదండ్రులు ఒకప్పుడు మన దేశం నుంచి వలసవెళ్లి దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. భారతదేశం నుంచి ఉపాధి కోసం, మెరుగైన జీవితం కోసం ఎంతోమంది విదేశాలకు వెళ్లినట్లే… పిళ్లై తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్లారు. అలా 1941లో దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో ఒక సాధారణ భారత సంతతి కుటుంబంలో జన్మించారు నవనీతమ్ పిళ్లై. ఆమె చిన్నతనం ఎంతో కష్టాల మధ్య గడిచింది. ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో ‘వర్ణవివక్ష’ రంగు ఆధారంగా మనుషులను వేధించే నల్ల చట్టాలు అమల్లో ఉండేవి. ఆ వివక్షను ఆమె చిన్నప్పుడే ప్రత్యక్షంగా చూశారు, అనుభవించారు. కానీ, ఆ కష్టాలే ఆమెను ఒక ఉక్కు మనిషిగా మార్చాయి. కష్టాలను ఎదురించి చదువుకున్న నవనీతమ్ పిళ్లై… న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. ఆ కాలంలో దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల ఆధిపత్యమే ఉండేది. అలాంటి సమయంలో నాటల్ ప్రావిన్స్‌లో సొంతంగా లా ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా ఆమె అరుదైన రికార్డు సృష్టించారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానేత నెల్సన్ మండేలాతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల తరఫున ఆమె కోర్టుల్లో వాదించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రాణాపాయం ఉన్నా ఆమె వెనకడుగు వేయలేదు. ప్రజలకు న్యాయం చేయడమే తన ధ్యేయంగా ముందుకు సాగారు.
ఇక ఆమె సేవలు కేవలం దక్షిణాఫ్రికాకే పరిమితం కాలేదు. రువాండా మారణకాండ విచారణ ట్రిబ్యూనల్‌లో న్యాయమూర్తిగా, అధ్యక్షురాలిగా సేవలు అందించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా యుద్ధ సమయంలో జరిగే అత్యాచారాలను ‘జాతి నిర్మూలన నేరం’గా పరిగణించాలనే చారిత్రక తీర్పు వెనుక ఆమె పాత్రే ప్రధానం. తర్వాత హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి చీఫ్‌గా వ్యవహరించి ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల పరిరక్షణకు గళమెత్తారు. ఆమె చూపిన ఈ ధైర్యమే ఇప్పుడు ఆమెను ప్రపంచపు అత్యున్నత ‘నోబెల్ శాంతి బహుమతి’కి అర్హురాలిగా నిలబెట్టింది. సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో ఈ పురస్కారాన్ని ఆమెకు అధికారికంగా అందజేయనున్నారు.” ఎక్కడో పుట్టినా, మన దేశపు మూలాలు ఉన్న ఒక మహిళ ప్రపంచ శాంతి కోసం ఇన్ని విప్లవాత్మక మార్పులు తెచ్చిందంటే అది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. వివక్షను ఎదుర్కొని, ప్రపంచానికి న్యాయం పాఠాలు నేర్పిన నవనీతమ్ పిళ్లై ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఓ స్ఫూర్తి.. అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కుల గొంతుకగా నిలిచిన నవీ పిళ్లైకి ఈ అత్యున్నత గౌరవం దక్కడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
