దేశంలో ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ దర్శనం ఇస్తుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే లెక్క. అంతేకాదు స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఎక్కడి పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం కామన్ అయ్యింది. తమ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఫోటోలు తీసుకోవాలి.. వాటిని ఇన్ స్ట్రా, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి లైక్స్, షేర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. కాకపోతే సమయానికి పోలీసులు, స్థానికులు స్పందించి ముగ్గురు యువకులను కాపాడారు. దీనికి సంబంధించి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం తమిళనాడులో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. భారీ వర్షాల కారణాంగా కావేరీ నది ఉప్పొంగి పోతుంది.. చుట్టు పక్కల వాగులు పొంగి పొర్లుతున్నాయి. అలా ఒక వాగు ముగ్గురు యువకులు సాహసం చేసి మద్యలోకి వెళ్లి సెల్ఫీ తీసుకుందామని భావించారు. కానీ అప్పటికీ నీటి ఉధృతి మరింత పెరిగిపోవడంతో ఏం చేయాలో తోచక కేకలు పెట్టారు. తమని రక్షించండి మహాప్రభో అంటూ బోరున ఎడ్చారు.
ఇది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి స్థానికుల సహాయంతో ముగ్గురిని రక్షించగలిగారు. కొంచెం ఆలస్యం అయినా ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవని.. భారీగా వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని.. ఇలాంటి సాహసాలు చేస్తే ప్రాణాలు పోవడం ఖాయమని పోలీసులు అంటున్నారు. చెన్నైతో పాటు కాంచీపురం పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.