మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. కులం, మతం అన్నవి వారి నుంచి విడదీయరానివిగా మారిపోయాయి. ముఖ్యంగా జనాల్లో కులం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు కులం ప్రభావం చూపెడుతోంది. అన్ని రంగాల్లోనూ ఇది కనబడుతోంది. ముఖ్యంగా సినిమా రంగంలో కులం కీలక పాత్ర పోషిస్తోంది. ఇండస్ట్రీలోని నూటికి 90 శాతం మంది తమ కులం వారికి సహాయం చేస్తుంటారన్న ప్రచారం కూడా ఉంది. అయితే, చాలా కొద్ది మంది మాత్రమే కుల ప్రస్తావన లేకుండా, తేకుండా సినిమా ఇండస్ట్రీలో జీవిస్తుంటారు. అలాంటి వారి జాబితాలోకి ‘‘భీమ్లానాయక్’’ సినిమా హీరోయిన్ సంయుక్త మీనన్ చేరిపోయారు. తన పేరు పక్కన కులం పేరును వాడొద్దని ఆమె అంటున్నారు.
తాజాగా, ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నన్ను కులం పేరుతో పిలవటం నాకు ఇష్టం లేదు. నేను నటించిన సినిమాల్లో కూడా నా పేరు పక్కన కులం పేరు వేయోద్దని అంటున్నా. నన్ను నా కులం పేరుతోనే పిలవాలని ఏమీ లేదు. నన్ను సంయుక్త మీనన్ అని పిలవటం కంటే.. సంయుక్త అని పిలవటానికే ఎక్కువ ఇష్టపడతాను’’ అని చెప్పుకొచ్చారు. తనకు తమిళ సినిమాల్లో నటించాలని ఉందని.. కానీ, సరైన అవకాశాలు రావటం లేదని వాపోయారు. వచ్చిన వాటిని కథలు బాగోలేక రిజెక్ట్ చేశానని అన్నారు. కాగా, సంయుక్త 2016లో వచ్చిన ‘పాప్‌కార్న్’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు.
2018లో వచ్చిన కలరి అనే సినిమాతో తమిళ ఎంట్రీ ఇచ్చారు. 2022లో విడుదలైన ‘భీమ్లా నాయక్’ ఆమె తొలి తెలుగు సినిమా. మొదటి సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు. తర్వాత బింబిసార సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సార్, విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, విరూపాక్ష సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మరి, కులం పేరుతో తనను పిలవద్దని అంటున్న సంయుక్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.