మెగాస్టార్ 70వ జన్మదినోత్సవం సందర్భంగా రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో ఒకటి విశ్వంభర గురించైతే, మరొకటి అనిల్ రావిపూడి సినిమా గురించి. ఒకేసారి రెండు అప్‌డేట్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేవు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవం రేపు ఆగస్టు 22న. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసే వివిధ రకాల కార్యక్రమాల సంగతేమో గానీ నిర్మాతలు మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందిస్తున్నారు. చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఫాంటసీ సినిమా విశ్వంభర గురించి స్వయంగా చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా విశ్వంభర ఎందుకు ఆలస్యమౌతుందో వివరించారు. సినిమా రెండో భాగమంతా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌పై ఆధారపడి ఉన్నందున అత్యున్నత ప్రమాణాలతో రూపొందించే క్రమంలో జాప్యం జరుగుతోందని వివరించారు. అయితే వచ్చే వేసవికి విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నామని లీక్ చేస్తున్నానన్నారు.
విశ్వంభర ఫస్ట్ గ్లింప్స్ విడుదల
ఇక చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వంభర నిర్మాతలు ఒకరోజు ముందు అంటే ఇవాళ ఆగస్టు 21 సాయంత్రం 6.06 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. కచ్చితందా ఈ గ్లింప్స్ వైరల్ కానుందనే అంచనా ఉంది. ఈ విషయాన్ని కూడా స్వయంగా చిరంజీవి ఇదే వీడియో ద్వారా స్పష్టం చేశారు. సినిమా మాత్రం చందమామ కధలా హత్తుకుంటుందంటున్నారు.
అనిల్ రావిపూడి-చిరంజీవి సినిమా టైటిల్ ప్రకటన
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 157వ సినిమాపై మరో కీలకమైన అప్‌డేట్ రేపు అంటే ఆగస్టు 22వ తేదీ ఉదయం 11.25 గంటలకు రానుంది. ఇది సినిమా టైటిల్ గ్లింప్స్ అని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ ఈవెంట్ ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్ నెంబర్ 6లో జరగనుంది. సినిమా టైటిల్ మన శంకర వర ప్రసాద్ గారు అని ఉంటుందని తెలుస్తోంది. ట్యాగ్‌లైన్‌గా పండక్కి వస్తున్నారు అని ఉంటుందట. ఈ సినిమాలో చిరంజీవితో పాటు నయనతార నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతికి విడుదల ఖాయమైంది. అంటే 156వ సినిమా కంటే ముందే 157వ సినిమా ధియేటర్లలో రానుంది.