ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పాపులారిటీ పెంచుకోవటానికి కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇంకా కొంతమంది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తాజాగా, ఓ ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులారిటీ తెచ్చుకోవటానికి..
పాపులారిటీ పిచ్చి ఒక్క సారి బుర్రలోకి చేరిందంటే అది అంత సులభంగా మనల్ని వదిలిపోదు. తరచుగా ప్రజల నోళ్లలో నానాలన్న ఆలోచన పిచ్చి పనులు చేసేలా చేస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న వాళ్లు ఇలా పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. తమను ఫాలో అయ్యేవారి సంఖ్య పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రాణాలు తీసుకునే లేదా ప్రాణాలు తీసే పనులకు తెగబడుతుంటారు. తాజాగా, ఓ ఇద్దరు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే ప్రయత్నంలో ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని హదప్సర్లో ఆలస్యంగా వెలుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హదప్సర్కు చెందిన అయన్ షేక్, సయ్యద్ జావిద్ షేక్‌లకు ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులారిటీ తెచ్చుకోవాలన్న కోరిక బలంగా ఉంది.
ఇందుకోసం బైక్ స్టంట్లు చేసి వాటిని రీల్స్ రూపంలో ఇన్‌స్టాలో పోస్ట్ చేయాలని భావించారు. అలా చేయటం ద్వారా తమకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ పెరుగుతారని వారు భావించారు. అనుకున్నదే తడువుగా మార్చి 6వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బైకుతో రోడ్డు మీదకు చేరారు. బీజీగా ఉన్న రోడ్డుపై స్పీడుగా బైకు నడుపుతూ దాన్ని వీడియో తీయసాగారు. ఈ నేపథ్యంలోనే ఫిరోజ్ పఠాన్ అనే మహిళ అదే రోడ్డుపై వీరికి ఎదురుగా వచ్చింది. అతి వేగం కారణంగా ఈ కుర్రాళ్ల బైకు ఫిరోజ్ పఠాన్ స్కూటీని ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టిన వేగానికి స్కూటీపై వస్తున్న ఆమె ఎగిరి కింద పడింది.
ఆమె తల బలంగా నేలకు కొట్టుకుంది. దీంతో తలకు తీవ్ర గాయం అయింది. ఆ గాయం కారణంగా అధిక రక్తం స్రావం జరిగింది. ఫిరోజ్ పఠాన్ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె అలా నేలపై పడగానే కుర్రాళ్లు అక్కడినుంచి పరారయ్యారు. సమచారం అందుకున్న పోలీసులు ఫిరోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. మరి, ఇన్‌స్టా రీల్స్ కోసం ఓ మహిళ ప్రాణాలు తీసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
