Minor Demat Account : ఇంట్లో పసిపాప పుట్టగానే వెంటనే తులం బంగారం కొనిపెట్టడం లేదా పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ రికరింగ్ డిపాజిట్లలో డబ్బులు దాచడం అనేది మన తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయమైన అలవాటు. కానీ, మారుతున్న నేటి డిజిటల్ యుగంలో నేటితరం తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో ఊహించని విప్లవాత్మకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడే రాబడిని పాత విధానాలు ఇవ్వలేకపోతున్నాయనే అవగాహన పెరగడంతో, నేటి యువ దంపతులు తమ పిల్లల భవిష్యత్తు కోసం స్టాక్ మార్కెట్ బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ జరోధాలో నమోదైన ఒక విచిత్ర సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లను, సాధారణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుట్టి కేవలం 28 రోజులే అయిన ఒక పసికందు పేరిట ఆమె తల్లిదండ్రులు మైనర్ డీమాట్ ఖాతా తెరిచి దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రారంభించారు. గతంలో ఉన్న 64 రోజుల రికార్డును తిరగరాస్తూ నమోదైన ఈ ఆసక్తికర విషయాన్ని జరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికపై వెల్లడించారు. అసలు పసిపిల్లల పేరిట డీమాట్ ఖాతా తెరవడం చట్టబద్ధంగా సాధ్యమేనా? దీనికున్న రూల్స్ ఏంటి? ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి? అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు మైనర్ డీమాట్ అకౌంట్ అంటే ఏమిటి, దాని నియమావళి ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. పుట్టిన రోజుల పసికందు నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల పేరిట తెరిచే ట్రేడింగ్ డీమాట్ ఖాతాను మైనర్ డీమాట్ అకౌంట్ అంటారు. అయితే భారతీయ కాంట్రాక్ట్ చట్టం ప్రకారం మైనర్లు స్వయంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకోలేరు. కాబట్టి ఈ ఖాతాలోని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌పై చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు పూర్తిగా ఆ చిన్నారివే అయినప్పటికీ, వారికి 18 ఏళ్ల వయసు నిండేంత వరకు ఖాతాను స్వయంగా నిర్వహించే అధికారం ఉండదు. తల్లిదండ్రులు లేదా కోర్టు ద్వారా గుర్తింపు పొందిన సంరక్షకులు మాత్రమే ఆ ఖాతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఇక్కడ ముఖ్యమైన బ్యాంకింగ్ నిబంధన ఏమిటంటే… డీమాట్ అకౌంట్లోకి నిధులు జమ చేయాలన్నా లేదా ఉపసంహరించుకోవాలన్నా ఆ డబ్బు తప్పనిసరిగా మైనర్ పేరిట ఉన్న సేవింగ్స్ ఖాతా లేదాజాయింట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే జరగాలి. నేరుగా గార్డియన్ సొంత బ్యాంక్ ఖాతా నుంచి మైనర్ డీమాట్ ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి సెబి నిబంధనలు అంగీకరించవు. జరోధా, గ్రో, ఏంజెల్ వన్ వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల్లో బర్త్ సర్టిఫికేట్, మైనర్ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ వివరాలు సమర్పించి సులభంగా ఆన్లైన్లో ఈ ఖాతాను తెరవవచ్చు.
ఈ మైనర్ డీమాట్ ఖాతాల ద్వారా లభించే అపారమైన ఆర్థిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక సంపద సృష్టి గురించి పరిశీలిస్తే… కాంపౌండింగ్ లేదా చక్రవడ్డీ అద్భుత శక్తి ఎంతటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలు పుట్టిన నాటి నుంచే నాణ్యమైన బ్లూ చిప్ షేర్లు, ఇండెక్స్ ఈటీఎఫ్‌లు లేదా స్థిరమైన మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీల ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, సదరు పాప లేదా బాబుకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి మార్కెట్ వృద్ధి అసాధారణమైన సంపదను సమకూరుస్తుంది. ఈ మూలధనం భవిష్యత్తులో వారి ఉన్నత విద్యకు, విదేశీ ప్రయాణాలకు లేదా సొంత వ్యాపార ప్రారంభానికి తిరుగులేని ఆర్థిక రక్షణగా నిలుస్తుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా, మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఐపీఓలు వచ్చినప్పుడు రిటైల్ కేటగిరీ కింద కుటుంబంలోని మైనర్ల పేరిట విడివిడిగా దరఖాస్తు చేయడం ద్వారా షేర్ అలాట్మెంట్ దక్కే సంభావ్యత గణనీయంగా పెరుగుతుంది. పైగా తల్లిదండ్రులు తమ సొంత పోర్ట్‌ఫోలియోలోని షేర్లను కూడా మైనర్ ఖాతాకు గిఫ్ట్ రూపంలో సులభంగా బదిలీ చేసుకోవచ్చు. జరోధా వంటి సంస్థలు వీటిపై ఎలాంటి వార్షిక నిర్వహణ రుసుములు విధించకపోవడం మరో పెద్ద అడ్వాంటేజ్.
అయితే, చిన్న పిల్లల భద్రతను, వారి పెట్టుబడులను రక్షించడం కోసం SEBI కొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. మైనర్ ఖాతా ద్వారా ఈక్విటీ డెలివరీ ఇన్వెస్ట్మెంట్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, ఐపీఓలు, కంపెనీల బైబ్యాక్‌లలో మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉంది. అత్యంత రిస్క్ ఉండే ఇంట్రాడే ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వంటి డెరివేటివ్స్ విభాగాల్లో లావాదేవీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం. మైనర్ ఖాతాల ద్వారా మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయడానికి సెబి ఎంతమాత్రం అనుమతించదు. ఇక పన్ను విధానాన్ని పరిశీలిస్తే… ఇన్కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారం మైనర్ ఖాతా నుంచి వచ్చే ఎలాంటి మూలధన లాభాలు లేదా డివిడెండ్లు అయినా సరే, విడిగా పన్ను పరిధిలోకి రావు. ఆ ఆదాయం మొత్తం తల్లిదండ్రుల వార్షిక ఆదాయానికి జత చేయబడుతుంది . సంరక్షకుడి పన్ను స్లాబ్ రేట్ల ప్రకారమే ప్రభుత్వం నిర్దేశించిన పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.
ఇక చివరిగా, సదరు చిన్నారికి 18 ఏళ్ల వయసు నిండిన మరుక్షణమే ఈ మైనర్ డీమాట్ ఖాతా అటెమెటిక్ గా నిలిపివేయబడుతుంది. ఆ తర్వాత ఆ యువకుడు లేదా యువతి స్వయంగా తమ సొంత పాన్, ఆధార్ కార్డులతో కొత్త కేవైసి ప్రక్రియను పూర్తి చేసి, దానిని ఫుల్ ప్లెడ్జ్డ్ మేజర్ డీమాట్ అకౌంట్‌గా మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకు ఆ ఖాతాలోని పెట్టుబడులన్నీ తల్లిదండ్రుల పరివేక్షణలోనే సురక్షితంగా కొనసాగుతాయి. పిల్లల భవిష్యత్తు కోసం ప్రారంభ దశ నుంచే క్రమశిక్షణతో కూడిన ఈక్విటీ పెట్టుబడులను ఎంచుకోవడం వల్ల కాలక్రమేణా భారీ ఆర్థిక సంపదను సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది.
