డబ్బింగ్ మూవీస్ మనకు కొత్తేం కాదు. ఒకప్పుడు థియేటర్లలో, ఇప్పుడు ఓటీటీలో చూస్తున్నాం. అంతే తేడా. తాజాగా ప్రేక్షకుల్ని అలా పలకరించిన మూవీ 'పతు తలా'. ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
ప్రతివారం థియేటర్లలో కొత్త సినిమాలు ఎలానూ రిలీజ్ అవుతుంటాయి. ఓటీటీలోనూ పలు కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంటాయి. తాజాగా అలా తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన మూవీ ‘పతు తలా’. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ తమిళ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ లో అందుబాటులోకి వచ్చేసింది. మనలో చాలామందికి తెలిసిన శింబు.. ఇందులో లీడ్ రోల్ లో నటించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కిడ్నాప్ అవుతారు. దీనికి కారణం AGR (సింబు) అని అందరూ అనుమానిస్తూ ఉంటారు. మరోవైపు సీబీఐ కూడా సీఎం కనిపించకుండా పోవడంపై దర్యాప్తు స్టార్ట్ చేస్తుంది. గుండాగా పనిచేస్తున్న ఓ అండర్ కవర్ పోలీస్ ని AGR గ్యాంగ్ లో చేర్చుతుంది. మరి ఆ పోలీస్.. AGR రహస్యాలని కనిపెట్టాడా? ఇంతకీ ముఖ్యమంత్రి మిస్సింగ్ కి కారణమేంటి? ఈ స్టోరీలో గుణ(గౌతమ్ కార్తిక్), నాగినేని గుణశేఖర్(గౌతమ్ మేనన్) ఎవరు? చివరకు ఏమైంది తెలియాలంటే ‘పతు తలా’ మూవీని మీరు చూడాల్సిందే.
2017లో కన్నడలో ‘మఫ్టీ’ అని ఓ సినిమా రిలీజైంది. శివరాజ్ కుమార్ తనదైన స్వాగ్ యాక్టింగ్ తో మూవీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. అలా హిట్ అయిన ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో ‘పతు తలా’ పేరుతో రీమేక్ చేశారు. ఓ పవర్ ఫుల్ డాన్.. అతడు చేస్తున్న అక్రమాలని బయటపెట్టిన అండర్ కవర్ పోలీస్ స్టోరీనే ఈ సినిమా. ‘పతు తలా’ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే యాక్షన్ క్రైమ్ డ్రామా విత్ అన్న-చెల్లి సెంటిమెంట్. ఇలాంటి కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. అయినా సరే ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే చిన్న చిన్న ట్విస్టులకు తోడు ఓటీటీలో అందుబాటులో ఉంది కాబట్టి అలా అలా చూసేయొచ్చు.
ఫస్టాప్ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ‘సంక్షేమం క్షేమం’ అనే ఆరోగ్య పథకాన్ని సీఎం ప్రారంభించడంతో సినిమా మొదలవుతుంది. ఆ మీటింగ్ లో సీఎంకి, డిప్యూటీ సీఎంకి పడదు అన్నట్లు చూపించారు. కాసేపటికి ముఖ్యమంత్రి కిడ్నాప్ కావడం.. AGRపై సీబీఐ అనుమానపడటం, రౌడీల్లో ఒకడైన అండర్ కవర్ పోలీస్ గుణ అలియాస్ శక్తిని రంగంలోకి దింపడం.. అతడు AGR దగ్గర చేరడం.. ఇలా సీన్లన్నీ చకచకా వెళ్తుంటాయి. తొలి భాగంలో ఒకటి రెండు సీన్లలో శింబు కనిపిస్తాడు. సరిగా ఇంటర్వెల్ కి AGR ఎంటర్ అవుతాడు. అక్కడ నుంచి మొత్తం అతడే ఉంటాడు. స్టోరీ కూడా చాలా ఫాస్ట్ గా పరుగెడుతుంది. ఇంతకీ ఈయన ఎవరు? రాష్ట్రాన్ని శాసించేంత పవర్ ఎక్కడ నుంచి వచ్చింది లాంటివి సెకండాఫ్ లో రివీల్ చేస్తూ వెళ్లారు.
తెలుగు ప్రేక్షకుల ఈ తరహా సినిమాల్ని ఇప్పటికే చాలా చూశారు. ‘పతు తలా’ అలా తీసినప్పటికీ ఓ రకంగా బాగానే ఉంది. రౌడీ గుణ(గౌతమ్ కార్తీక్), తహశీల్దార్ లీల (ప్రియా భవానీ శంకర్) మధ్య ఫస్టాప్ లో చూపించిన లవ్ స్టోరీ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. ఆ పోర్షన్ పై కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. సినిమా అంతా బాగానే ఉన్నప్పటికీ.. చాలావరకు సీన్లలో ఇంపాక్ట్ ఏదో మిస్ అయినట్లు కనిపించింది. ఫస్టాప్ కొన్నికొన్నిచోట్ల బోరింగ్ గా అనిపించినా.. సెకండాఫ్ లో శింబు తన యాక్టింగ్ తో చాలావరకు కవర్ చేసేశాడు. డాన్ గా సెట్ అయ్యాడనే చెప్పాలి. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్ ని బాగానే డిజైన్ చేసుకున్నారు. అయితే చివర్లో వచ్చే అన్న-చెల్లి సెంటిమెంట్ ని ఏదో ఆదరబాదరగా చెప్పేసినట్లు అనిపిస్తుంది.
ఈ సినిమా ఫస్టాప్ లో గౌతమ్ కార్తిక్.. సెకండాఫ్ లో శింబుతోపాటు గౌతమ్ కనిపిస్తాడు. అండర్ కవర్ పోలీస్ గా చేసిన గౌతమ్.. సినిమా అంతా కూడా దాదాపు సీరియస్ లుక్ తోనే ఉంటాడు. సో పెద్దగా వేరియేషన్స్ చూపించడానికి స్కోప్ లేకుండా పోయింది. శింబు, డాన్ గా గడ్డంతో డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో గౌతమ్ మేనన్ పర్వాలేదనిపించాడు. హీరోయిన్ గా చేసిన ప్రియా భవానీ శంకర్ తోపాటు మిగతా పాత్రధారులు ఓకే ఓకే అనిపించారు. యాక్టింగ్ పరంగా అందరూ బాగానే చేసుకుంటూ వెళ్లిపోయారు.
రీమేక్ సినిమా అయినా సరే చాలా రిచ్ గా తీశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగు డబ్బింగ్ లో పాటలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏఆర్ రెహమాన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకొచ్చారు కానీ సరిగా ఉపయోగించుకోలేకపోయారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై సరిగా కాన్సట్రేట్ చేయలేదనిపించిది. ఓ చోట బీజీఎం బాగుంటే.. మరోచోట చెత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ ఒబెలి N కృష్ణ పెద్దగా కష్టపడలేదనే చెప్పాలి. ఒరిజినల్ లో మార్పులేం చేయకుండా అలా తీసుకుంటూ వెళ్లిపోయారు. టేకింగ్ విషయమై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువులు రిచ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే ‘పతు తలా’.. తెలుగు ప్రేక్షకులకు ఓటీటీలో టైమ్ పాస్ మూవీ. ఈ వీకెండ్ ఏదైనా కొత్తది చూడాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.
చివరగా: ‘పతు తలా’.. టైమ్ పాస్ మూవీ!
రేటింగ్: 2