అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతన్నల కడుపునింపే దిశగా అడుగులు వేస్తోంది. పంట అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు వచ్చే రైతన్నలకు రూ. 5కే రుచికరమైన భోజనం అందించాలని యోచిస్తోంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు రూ. 5కే రుచికరమైన భోజనం అందించాలని భావిస్తోంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పంట అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు వచ్చే అన్నదాతలు సమీపంలోని హోటళ్లు, క్యాంటీన్లలో భోజనం చేస్తుంటారు. ఇక పంట అమ్ముడుపోని పక్షంలో రాత్రింపగళ్లు అక్కడే గడిపేస్తుంటారు. ఆ సమయాల్లో పంట అమ్ముడుపోలేదనే బాధ ఒకవైపు, ఆకలి అరుపులు మరొకవైపు. వందల రూపాయలు వెచ్చించలేక ఒక్కపూటతోనే సరిపెట్టుకుంటుంటారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే.. రూ. 5కే భోజనం.
ప్రస్తుతం తెలంగాణలో 279 మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఇందులో 192 ప్రధాన మార్కెట్ యార్డులు కాగా, 87 ఉప యార్డులు. ఇన్ని యార్డులు ఉన్నా, వీటిలో కనీస సౌకర్యాలు ఉన్నవి 4 నుంచి 5 మాత్రమే. అన్నం మాట దేవుడెరుగు.. కొన్ని చోట్ల తాగేందుకు నీటి వసతి కూడా లేదు. ఇక రైతన్నల నిద్ర అంటే.. పంటపైనే పడుకొని కునుకు తీయడమే. వీటిన్నిటికీ ప్రభుత్వం పరిష్కారం చూపకపోయినా.. అన్నధాతల కడుపు నింపేదుకు ముందడుగు వేసింది. మార్కెట్ యార్డుల్లో రైతులకు రూ.5కే భోజన సౌకర్యం నిమిత్తం త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనుంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘అన్నపూర్ణ పథకం’ ద్వారా పట్టణాలు, నగరాలు, ఆసుపత్రుల్లో సహాయకుల కోసం రూ.5కే రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ.21 రాయితీ చెల్లిస్తోంది. ఈ పథకం సక్సెస్ కావటం, అందరిచేత ప్రశంసలు పొందటంతో ఇప్పుడు దీన్ని మార్కెట్ యార్డులకూ విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల్లో రోజుకు 10 వేల మంది అన్నదాతలకు భోజన సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ రైతుబజార్ల(36)లో అక్కడక్కడా ఈ సౌకర్యం కల్పించనున్నారు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
