భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెడుతూ కీలక ప్రకటన చేశాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్‌ఏఐ’తో తాను భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు అధికారికంగా వెల్లడించాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సచిన్. త్వరలోనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు రాబోతున్నాయని, వాటిని పంచుకోవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు.
ఈ భాగస్వామ్యంపై సచిన్ తన అనుభవాలను పంచుకున్నాడు. తనకు ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందని, ఒక ప్రశ్న మరో ప్రశ్నకు దారితీస్తుందనే అలవాటును చాట్‌జీపీటీ మరింత ప్రోత్సహించిందని తెలిపారు. కేవలం ఉత్సుకత తీర్చడమే కాకుండా, పనులు పూర్తి చేయడంలోనూ ఇది తనకు ఎంతగానో ఉపయోగపడిందని వివరించాడు. ఇటీవల sl కుటుంబంతో కలిసి వెళ్లిన ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి చాట్‌జీపీటీ తనకు చాలా సహాయపడిందని సచిన్ తెలిపాడు.
ఈ భాగస్వామ్యంతో చాట్‌జీపీటీ ద్వారా తాను ఇంకా ఏమేం చేయగలనో తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నానని సచిన్ తెలిపాడు. తనకు ఉపయోగపడిన విషయాలను ఇతరులతో పంచుకోవడంతో పాటు, మరింత మంది ప్రజలు తమకు ఆసక్తి ఉన్న అంశాలపై దీన్ని ప్రయత్నించేలా ప్రోత్సహిస్తానని తెలిపారు.
ఈ కొత్త ప్రయాణంపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, కలిసికట్టుగా కొత్త విషయాలను అన్వేషిద్దాం అంటూ ప్రకటించారు.
