ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఓటర్లపై హామీల వర్షం కురిపించడం చేస్తున్నారు. ఇక ఎన్నికల వేళ కొన్ని చోట్ల పలు ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రసుత్తం ఈ కోవకు చెందిన సంఘటన గురించి తెలుసుకుందాం.
సామాన్యంగా జీవితంలో ఒక్కసారి ఓటమి ఎదురైతేనే తట్టుకోలేం.. అలాంటిది.. వరుసగా 94 సార్లు ఓడిపోతే.. అలా ఓడిపోవడమే కాక.. 100 సార్లు ఓటమిని చవి చూడాలనే కోరిక ఉంటే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇలాంటి కోరిక కలిగిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో ఉన్నాడు. ఇప్పటికి అతడు 94 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి, ఓడిపోయాడు. 100 సార్లు ఓడిపోవడమే తన లక్ష్యం అంటున్నాడు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : రాజకీయాలు, రాజ్యసభ సీటుపై స్పందించిన చిరంజీవి
ఆగ్రా జిల్లా, ఖేరాగడ్ నియోజకవర్గానికి చెందిన హసనురామ్ అంబేడ్కరీ 1985 నుంచి స్థానిక సంస్థలు మొదలు.. లోక్ సభ ఎన్నికల వరకు ప్రతి సారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. 1988లో ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కానీ అది తిరస్కరణకు గురైంది. ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడం గురించి హసనురామ్ ను ప్రశ్నించగా.. ఆయన ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
నిష్పక్షపాత, అవినీతి రహిత అభివృద్ధి, సమాజంలో అట్టడుగు వర్గాల సంక్షేమమే నా ఎజెండా. బీఎస్పీ వ్వవస్థాపకుడు కాన్షీరాం స్థాపించిన అఖిల భారత వెనుకబడిన, మైనార్జీ వర్గాల ఉద్యోగుల సమాఖలో నేను కార్యకర్తగా చేరాను. బీఎస్పీలో కూడా కొంత కాలం పని చేశాను. ఈ క్రమంలో 1985లో టికెట్ అడిగితే.. నీ భార్య కూడా నీకు ఓటు వేయదు అని నన్ను హేళన చేశారు. దాంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని తెలిపాడు.
అంతేకాక ఓడిపోవడానికే నేను పోటీ చేస్తున్నాను. 100 సార్లు ఎన్నికల్లో ఓడిపోవడమే నా లక్ష్యం. అంబేడ్కర్ సిద్ధాంతాలను విశ్వసించే ఓటర్లకు ఆప్షన్ ఇచ్చేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తాను. కాబట్టి నా ప్రత్యర్థులు ఎవరనేది నేను పట్టించుకోను. నాకు ఆ అవసరం కూడా లేదు అని హసనురామ్ తెలిపాడు.
ఇక హసనురామ్ చదువుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఆయనకు హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చు. 1989 లోక్ సభ ఎన్నికల్లో ఫిరోజాబాద్ నుంచి పోటీ చేశాడు హసనురామ్. ఈ ఎన్నికల్లో ఆయన అత్యధికంగా 36 వేల ఓట్లు సంపాదించాడు.