సాధారణంగా చాలామంది ఎన్ఐటీలు, ఐఐటీలు, నీట్ వంటి మరికొన్ని వాటిల్లో సీట్ కోసం ఎంట్రన్స్ టెస్ట్ లు రాస్తుంటారు. మంచి కాలేజీలో సీట్ వస్తే భవిష్యత్తు బాగుటుందని ఎంట్రన్స్ టెస్ట్ కోసం కష్టపడతారు. అలా భావించిన ఓ గ్రామ ఓటర్లు వారి భవిష్యత్తు కోసం ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. అక్కడ సర్పంచ్ కావాలంటే మాత్రం ఆ పంచాయతీ ప్రజలు పెట్టే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే. అందులో ఉత్తీర్ణులైన వారికే తమ ఓటు అని వింత షరతు పెట్టారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీపడుతున్న వారంతా ఈ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యారు. ఈ వెరైటీ సర్పంచ్ ఎన్నిక ఒడిశాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఒడిశాలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అక్కడ లోకల్ వార్ ఆరంభమైంది. ఐదు దఫాల్లో జరిగే ఈ ఎన్నికల్లో చాలామంది పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే పోటీ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎంత తీవ్రమైన పోటీ ఉన్నా ఎవరిని పడితే వారిని ఎన్నుకోమని కుట్రగ్రామ్ పంచాయతీ పరిధిలోని మలుపదా గ్రామస్థులు తేల్చిచెబుతున్నారు. తమ ఓట్లు కావాలంటే తాము పెట్టే పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని వింత షరతు పెట్టారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీపడుతున్న వారంతా పరీక్షకు భారీ స్థాయిలో సిద్ధమయ్యారు. ఆదివాసీలు అధికంగా ఉండే ఈ పంచాయతీకి ఎన్నికలు ఈనెల 18న జరగనున్నాయి. చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
సర్పంచ్ పదవికి సంబంధించి మలుపదా గ్రామ పాఠశాల ఆవరణంలో పరీక్ష నిర్వహించారు. పలువురు ఈ పరీక్షకు హజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు కొనసాగిన ఈ పరీక్షలో సర్పంచ్ కి ఉండాల్సిన అర్హతలు, లక్ష్యాలు, సంక్షేమాలపై అవగాహన, స్థానిక పరిస్థితులపై పట్టు వంటి తదితర అంశాలను ఈ పరీక్షలో పొందుపర్చారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని తదుపరి విధానంలో సర్పంచ్ గా ఎన్నుకుంటారు. మరి ఈ వెరైటీ సర్పంచ్ ఎన్నికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.