ఈ మధ్యకాలంలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించిన సమస్యలతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఈ వాయు కాలుష్యం కారణంగా సంభంవించే మరణాల సంఖ్య కూడా పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలుష్యానికి ప్రధాన కారణం పరిశ్రమలు,వాహనాల నుంచి వెలువడే పొగలు. ఈ కాలుష్య నియంత్రణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు ట్రాఫిక్ రూల్స్ లో ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇక నుంచి ట్రాఫిక్ దగ్గర రెడ్ సిగ్నల్ పడితే.. వాహనాల ఇంజన్ ఆపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విషయం గురించి కేజ్రీవాల్ సర్కార్ ప్రచారం మొదలు పెట్టింది.
దేశంలోని అనేక నగరాలు వాయు కాలుష్యంలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరం ఈ కాలుష్యానికి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక్కడ వాయు కాలుష్యం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఎప్పుడూ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉంటుంది. దానిని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక వ్యూహంతో ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే గతంలో వాహనాలకు సంబంధించి సరి, బేసి విధానంలో రోడ్లపైకి రావాలని ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. అలాగే దీపావళి పండగ రోజున టపాసులు కాల్చడంపై నిషేధం విధించింది. ఆరోజున టపాసులు బదులు స్వీట్లు పంచుకోవాలని సుప్రీం కోర్టు సైతం ఆదేశించింది. తాజాగా కేజ్రీవాల్ ప్రభుత్వం మరికొన్ని నిబంధనలని రూపొందించింది. దీనిని 15అంశాలతో కూడిన ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగా “రెడ్ లైట్ ఆన్.. గాడి ఆఫ్”అనే పేరుతో కొత్త ప్రచారం మొదలు పెట్టింది.
ఈ కొత్త రూల్ ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడితే.. వెంటనే వాహన ఇంజన్ ఆఫ్ చేయాలి. ఏ వాహనదారుడైన సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడగానే ఇంజన్ ఆపేయాలి. తిరిగి గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఇంజన్ ఆఫ్ లోనే ఉంచాలి. ఇలా ఢిల్లీలోని ప్రతి సిగ్నల్ దగ్గర మూడు వైపులా వాహనాల ఇంజన్ లు ఆపేయడం వల్ల దాదాపు 15-20 శాతం వాయు కాలుష్యం తగ్గుతుందని కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నిబంధనపై ప్రజల్లో అవగాహన కలిగేందుకు ప్రచారాలు మొదలుపెట్టింది అక్కడి ప్రభుత్వం. ఇందుకోసం వాలంటీర్ల ద్వారా ఈ నిబంధనపై అవగాహన కలిపిస్తున్నారు. సిగ్నల్ వద్ద వాలంటీర్లు నిల్చుని..వాహనాదారులకు గులాబీ పూలు ఇచ్చి.. వాహనాల ఇంజన్ ఆఫ్ చేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం కోసం దాదాపు 2500 మంది వరకు వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన అందరిని ఆకట్టుకుంది.