కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడప్పడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. దేశ, రాష్ట్ర భద్రత దృష్ట్యా పలు ఆసక్తికరమైన, కఠిన రూల్స్ ను అమల్లోకి తీసుకొస్తుంటారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యంగా బాగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. శనివారం నుంచి ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకి సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు సంస్థలకు కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్.. కాలుష్య నియంత్రణ ప్రణాళికను వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగో దశ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రణాళిక ప్రకారం.. ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమల్లోకి తీసువస్తున్నారు. ప్రైవేటు ఆఫీసుల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. అంతే కాక ఆఫీసులు, మార్కెట్ల పనివేళలను కుదించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దీనిపై సంబంధిత అధికారులు ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం అమలు చేయనున్న ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన ఫ్యానెల్ ను ఏర్పాటు చేసినట్లు గోపాల్ రాయ్ తెలిపారు. ఈ సమావేశం కంటే ముందు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కాలుష్యంపై మీడియా సమావేశం నిర్వహించారు. కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నందున్న శనివారం నుంచి దిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఐదు, ఆపై తరగతుల విద్యార్ధులకు అవుట్ డోర్ గేమ్స్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు.