అమరావతి- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సినీ ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
చాలా రోజులుగా సినిమా ధియేటర్ టికెట్ ధరలపై పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను చిరంజీవి నాయకత్వంలో సీఎం జగన్ కు వివరించారు. టాలీవుడ్ ప్రముఖుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఓ అనూహ్య అంశం తెరపైకి వచ్చింది. ఈ సమావేశంలో ప్రముఖ కమేడియన్ అలీ కూడా పాల్గొన్నారు.
ఇది చదవండి: బిగ్ బ్రేకింగ్: IPLకు డేవిడ్ వార్నర్ దూరం! కారణం ఇదే..
ఈ క్రమంలో అలీకి రాజ్యసభ సీటు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి ముస్లిం మైనార్టీ వర్గానికి కేటాయించాలని జగన్ భావిస్తున్నారట. ఆ సీటు నటుడు అలీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి తదితరులతో సమావేశం తరువాత సీఎం వైఎస్ జగన్, అలీతో ప్రత్యేకంగా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది.
రాజ్య సభ సీటు అంశంపై మాట్లాడేందుకు త్వరలోనే మళ్లీ కలుద్దామని సీఎం జగన్, అలీకి చెప్పినట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అలీ, పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అలీకి నామినేటెడ్ పదవి ఇస్తారని అంతా అనుకున్నా, అది ఆచరణలోకి రాలేదు. అయినప్పటికీ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతూ వస్తున్న అలీని జగన్ రాజ్యసభకు పంపించేందుకు నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది.