ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ పెరిగింది. దీంతో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోహీరోయిన్స్ కూడా ఓటిటి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా హీరోయిన్స్ అంజలి, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ‘ఝాన్సీ’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ మొదలైన ఈ థ్రిల్లర్ డ్రామాకు.. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ లో ఉమెన్స్ ట్రాఫికింగ్, మాఫియా లాంటి అంశాలతో ఆసక్తిరేపిన ఈ వెబ్ సిరీస్.. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఝాన్సీ (అంజలి), సంకీత్ (ఆదర్శ్ బాలకృష్ణ) లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరికి కేరళలో పరిచయం ఏర్పడుతుంది. తన లైఫ్ లో ఏం జరిగిందో.. గతం మర్చిపోయిన ఝాన్సీని చేరదీస్తాడు. అయితే.. ఝాన్సీకి పీడకలల రూపంలో ఏవేవో షాకింగ్ సంఘటనలు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఝాన్సీ అసలు పేరు ఝాన్సీ కాదనే విషయం తెలుస్తుంది. మరి ఝాన్సీ అసలు పేరేంటి? ఝాన్సీ గతం మర్చిపోవడానికి కారణమేంటి? ఝాన్సీ లైఫ్ లోకి ఎంటరైన మోడార్(రుద్రప్రతాప్) ఎవరు? ఫారెన్ ఉన్న మాఫియా డాన్(రాజ్)కి, బార్బీ(చాందిని చౌదరి)లతో ఝాన్సీకి లింక్ ఏంటి? చివరిగా ఝాన్సీ గతం తెలుసుకునే ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసింది? అనేది సిరీస్ లో చూడాల్సిందే.
సాధారణంగా సినిమా అనేసరికి ఎన్నో చెప్పలేని విషయాలను తెరమీదకు తీసుకురావడానికి ఎంతో ఆలోచిస్తుంటారు మేకర్స్. అదే ఓటిటి విషయానికి వచ్చేసరికీ.. ఎలాంటి హార్డ్ హిట్టింగ్ కథలనైనా ప్రేక్షకులకు కన్వీనెంట్ వేలో ప్రెజెంట్ చేయొచ్చని నమ్ముతుంటారు. అదీగాక సినిమా అనగానే డ్యూరేషన్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కానీ.. వెబ్ సిరీస్ లో అలా కాదు. డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే ఎపిసోడ్స్ గా డివైడ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. సో.. ఎలాంటి కథలైనా ఓటిటిలో నిడివితో సంబంధం లేకుండా ఎంగేజింగ్ చెప్పొచ్చు అనేది ఓ పాయింట్. ఇక ‘ఝాన్సీ’ సిరీస్ విషయానికి వస్తే.. ఎంచుకున్న స్టోరీ లైన్ కొత్తదేమీ కాదు.
ఇదివరకు చాలా థ్రిల్లర్స్ లో చూసిన పీడకల.. ఆ కలలో కనిపించే సంఘటనలు.. వాటిని ఛేదించే లీడ్ క్యారెక్టర్.. ఈ జర్నీలో లైఫ్ స్ట్రగుల్స్, ట్విస్టులు ఇలా పాత వేలోనే తీసుకెళ్లారు. కాకపోతే.. పాత కథలోనే కొత్త ట్విస్టులు జోడించి కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నమే ఈ ఝాన్సీ. మరి అంత కొత్తగా చెప్పారా అంటే.. అంతా అని కాదు, కొంతవరకైతే ఆసక్తికరంగానే సాగిందని చెప్పవచ్చు. అయితే.. మనం ఎన్నో సినిమాలలో విమెన్ ట్రాఫికింగ్.. మాఫియా.. డివోర్స్ తీసుకున్న ఒంటరి మహిళలు.. బ్లాక్ మెయిలింగ్ తో అమ్మాయిలపై అఘాయిత్యాలు.. చిన్న పిల్లలపై వేధింపులు లాంటి విషయాలు చూసేశాం. అయితే.. ఈ అంశాలన్నింటినీ ఒకే సిరీస్ లో అల్లుకొని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు తిరు.
దర్శకుడు తిరు గతంలో విశాల్ తో కిలాడీ, వేటాడు వెంటాడు, ఇంద్రుడు.. రీసెంట్ గా హీరో గోపీచంద్ తో చాణక్య సినిమాలు తీశాడు. మొదటిసారి ఓటిటి సిరీస్ డైరెక్ట్ చేశాడు. అయితే.. ఈ సిరీస్ లో ఝాన్సీ క్యారెక్టర్ ఒక్కటే బాగా రాసుకున్నారు. కానీ.. అందులో కూడా ఆ పీడకలలు రావడం.. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం.. కొన్ని కొత్త పాత్రలు ఉన్నట్టుండి వచ్చి వెళ్తుండటం ప్రేక్షకులను కొంచం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. మొత్తం 6 ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్ లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో చాందిని చౌదరి, ముమైత్ ఖాన్, ఆదర్శ్ బాలకృష్ణ, రుద్రా ప్రతాప్, దేవి ప్రసాద్ లాంటివారు వారి పరిధిమేరా పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సిరీస్ విషయంలో కొన్నిచోట్ల లాజిక్స్ మిస్ చేసిన దర్శకుడు.. కొన్ని క్యారెక్టర్స్ విషయంలో ఫ్రీడమ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ స్టోరీస్ లో విమెన్ ట్రాఫికింగ్, మహిళలపై అఘాయిత్యాలు లాంటి అంశాలను టచ్ చేసినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంటరెస్టింగ్ యాడ్ చేయవచ్చు. కానీ.. ఇందులో పోలీసుల ఇన్వాల్వ్ మెంట్ లైట్ తీసుకున్నారు. వన్ వేలో ఝాన్సీ.. ఆమె లైఫ్ ని మాత్రమే ఫోకస్ చేస్తూ వెళ్లిపోయారు. ప్రారంభం ఆసక్తికరంగా మొదలైనప్పటికీ, తర్వాత ఎపిసోడ్స్ మారుతున్నకొద్దీ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు కథలోకి తీసుకెళ్లడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు.
లీడ్ రోల్ ఝాన్సీగా అంజలి లేడీ గజినీ తరహాలో అనిపిస్తుంది. అయితే.. ఝాన్సీ రోల్ కి అంజలి న్యాయం చేసింది. క్యారెక్టర్ లో ఉండే షేడ్స్ ని చక్కగా క్యాచ్ చేశారు. అయితే. ఝాన్సీ క్యారెక్టర్ లో యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ యాంగిల్ కూడా ఉన్నంతలో బాగుంది. బార్బీగా చాందిని చౌదరి రోల్ ఓకే.. కానీ, ఆమె మాఫియాలోకి ఎలా వెళ్లిందనేది చెప్పలేదు. టెక్నికల్ గా ఈ సిరీస్ ని బాగా ప్రెజెంట్ చేశారు. ఆర్వీ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఝాన్సీ, బార్బీ మంచి ఫ్రెండ్స్.. కానీ, వారిద్దరూ డిఫెరెంట్ దారుల్లోకి ఎలా వెళ్లారు అనేది తెలియాలంటే ఝాన్సీ-2 కోసం వెయిట్ చేయకతప్పదు.