టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీలో కెఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 8 బంతులాడి 4 పరుగులు చేసిన రాహుల్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతులాడి 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆపై సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 14 బంతులాడి 9 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. మొత్తంగా మూడు మ్యాచుల్లో కలిపి రాహుల్ చేసిన పరుగులు 22. దీంతో రాహుల్ ను జట్టు నుంచి తప్పించాలంటూ విమర్శలొస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
కెఎల్ రాహుల్ ను గాయాల బెడద బాగా దెబ్బతీసింది. ఐపీఎల్ 2022 తర్వాత గాయపడి రెండు నెలల బ్రేక్ తీసుకున్న రాహుల్, ఆ తరువాత నుంచి పెద్దగా రాణించేట్లేదు. ముఖ్యంగా ఆసియా కప్ 2022 టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. అయినా అతని మీద ఉన్న నమ్మకంతో టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేశారు సెలెక్టర్లు. కానీ, అతని ఆట మాత్రం మారట్లేదు. సెంచరీ చేయాలన్నట్లుగా ఏకాగ్రత చూపుతున్నాడే తప్ప రాణించట్లేదు. పెద్ద జట్లతో విఫలమయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు.. కానీ, పసికూన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలంటూ మాజీలు సూచిస్తున్నారు. మాజీ ఓపెనర్ సెహ్వాగ్ సైతం దాన్నే సమర్థించాడు. అంతేకాదు.. వరుసగా విఫలమవుతున్న అతన్ని రోహిత్ ఎందుకు వెనుకేసుకొస్తున్నాడంటూ ఫైర్ అయ్యాడు.
“టీమిండియా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. కెఎల్ రాహుల్ గొప్ప ప్లేయరే, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అయితే అతను ఇప్పుడు సరైన ఫామ్‌లో లేడు. ముఖ్యంగా అతడు రాణించాలంటే స్వదేశీ పిచ్ లు కావాలి. బెంగుళూరు పిచ్ లు అతనికి సరిగ్గా సేరిపోతాయి. కానీ, టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది ఆస్ట్రేలియాలో. అక్కడ అలాంటివి ఉండవు. వరుసగా విపలమవుతున్నప్పుడు అతనికి విశ్రాంతినివ్వాలి. అలాకాకుండా కొనసాగిస్తే అతడు ఇంకా ఒత్తిడికి లోనై పరుగులు చేయలేడు. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఇతర ఆటగాళ్లకు అవకాశమివ్వాలి. ఈ విషయంలో రోహిత్ సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికైనా రిషబ్ పంత్ కు అవకాశమివ్వాలి..” అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.