ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చింది. అయినప్పటికీ కోపాన్ని అనుచుకుని, చాలా సహనంతో ఉన్నారు. అదేంటీ ఎన్టీఆర్ కు ఎవరిపై కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది.. అసలేం జరిగందనే కదా మీ ప్రశ్న. అదే విషయం చెప్పబోతున్నాం.. ఎన్టీఆర్ కు తన అభిమానులపై చాలా కోపం వచ్చింది.
అసలేం జరిగిందంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ పాన్ ఇండియా చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇక ఈ సంక్రాంతి పండగ సందర్బంగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్లతో బిజీ బిజీగా ఉంది.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం ముంబైలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి హాజరయ్యారు. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు పెద్ద ఎత్తున ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సైతం వచ్చారు. దీంతో ఈవెంట్ అంతా సందడి నెలకొంది. ఐతే ఈ క్రమంలో తమ అభిమాన నటులను చూసేందుకు జనం పెద్ద ఎత్తున లోపలికి తోసుకుంటూ వచ్చారు.
ఈ క్రమంలో కొందరు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోనికి వచ్చారు. కార్యక్రమం జరుగుతుండగా వచ్చినవారంతా అరుపులు, గోలలతో రచ్చరచ్చ చేయడంతో స్టేజీపై ఉన్న సెలబ్రిటీలు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. ఇది పద్దతి కాదు.. అందరూ కిందకు దిగుతారా.. లేదా.. పద్ధతిగా లేదు.. కిందకు దిగండి.. అని ఎన్టీఆర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలని, అందరూ పద్ధతిగా కిందకు దిగండి.. ఎన్టీఆర్ అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దీంతో అభిమానులు కాస్త వెనక్కి తగ్గారు. ఆ తరువాత ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ వేడుక సాఫీగా సాగింది, అభిమానులకు ఎన్టీఆర్ సర్దిచెప్పే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.