నవమాసాలు మోసి కనీ పెంచే తల్లి పిల్లలకు ఏం జరిగినా తల్లడిల్లిపోతుంది. తన ప్రాణాలు ఫణంగా పెట్టైనా పిల్లలను కాపాడుతుంది. పిల్లల కోసం అహర్శిశలూ కష్టపడుతూ వారికి బంగారు భవిష్యత్ కోసం శ్రమిస్తుంటాడు తండ్రి. అలాంటి తల్లిదండ్రులను వృద్దాప్యంలో అనాధాశ్రమాలకు పంపుతున్నారు. తల్లిదండ్రులపై ప్రేమ ఉండేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ఓ తల్లికోసం తనయుడు ఏకంగా తన ప్రాణాలనే బలిపెట్టాడు. ఈ విషాద ఘటన బంగాల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
వెస్ట్ బంగాల్ కి చెందిన సురాజిత్ ఇటీవల తన తల్లివద్దకు వచ్చాడు. ఉద్యోగరిత్యా వేరే గ్రామంలో భార్యతో నివసిస్తున్నాడు సురాజిత్. ఇటీవల సెలవులు రావడంతో దుర్గామాత పూజ కోసం నాగేంద్రపూర్ లోని తన సొంత ఊరికి వచ్చాడు సురాజిత్. పండుగ సందర్బంగా ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపాడు. పిల్లలు రావడంతో వారికి పిండి వంటలు చేసేందుకు సురాజిత్ తల్లి వంటింట్లో పొయ్యి వెలిగించి వంట చేస్తుంది. పొయ్యి నుంచి పొగలు రావడంతో పక్కన చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి.
తేనె టీగలు అకస్మాత్తుగా దాడి చేయడంతో సురాజిత్ తల్లి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. తల్లి కేకలు విన్న సురాజిత్ వెంటనే వంట గదిలోకి వెల్లి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు.. తల్లిపై దుప్పటి కప్పి ఇంట్లోకి పంపించివేశాడు.. కానీ అప్పటికే సురాజిత్ పై తేనెటీగలు విపరీతంగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ సురాజిత్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని ఓ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పండుగకు వచ్చి సంతోషంగా ఉంటాడనుకున్న తల్లి కొడుకు విగతజీవిగా మారిపోవడంతో కుమిలిపోయింది.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.