ప్రతి ఒక్కరి జీవితంలో చదువు ఎంతో ముఖ్యమైంది. అలాగని చదువే సర్వస్వం అంటారా? చదువు లేకపోతే జీవితం లేనట్లేనా? అరకొర మార్కులతో పాసైతే.. ఇంక మన జీవితం ఆగమైపోయినట్లేనా? తరగతి గదిలో ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్లే అద్భుతాలు సృష్టిస్తారా? బ్యాక్ బెంచర్స్ ఎందుకూ పనికిరారా? ఇలాంటి ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు విద్యార్థులు, తల్లిందండ్రుల మదిలో మెదులుతూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఒక యాప్ట్ డైలాగ్ ఉంది. ‘ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే బోర్డు మాత్రమే చూడగలరు.. అదే బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే ప్రపంచాన్నే చూడచ్చు’. అవును అది అక్షరాలా నిజమని నిరూపించిన ఓ ఐఏఎస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చదువుకు మార్కులు కొలమానం కాదని.. పదో తరగతిలో ఫెయిల్ అయినా.., తక్కువ మార్కులు వచ్చినా జీవితంలో ఉన్నత శిఖరాలు సాధించవచ్చని ఈ ఐఏఎస్ అధికారి నిరూపించాడు. అరకొర మార్కులతో పాసైతే.. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని.. అకుంటిత దీక్షతో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని చాటిచెప్పాడు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అలాంటి ఆలోచనా ధోరణిని మార్చేందుకు గుజరాత్‌లో భరూచ్చ్ జిల్లా కలెక్టర్ తుషార్ డి సుమేరా తన మార్కుల షీట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ మార్కుల లీస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తుషార్ డి సుమేరా కూడా మనలో ఎంతోమందిలానే బ్యాక్ బెంచర్. పదో తరగతి బోర్డు ఫలితాల్లో కేవలం పాస్ మార్కులతో గట్టెక్కారు. పదో తరగతిలో 100 మార్కులకు గాను ఇంగ్లీష్‌లో 35, లెక్కల్లో 36 మార్కులు మాత్రమే వచ్చాయి. అప్పట్లో తనని కూడా చాలా మంది చిన్న చూపు చూశారని.. తక్కువ మార్కులు వచ్చాయని హేళన చేసేవారని.. చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా భవిష్యత్ లో నువ్వేం సాధించగలవని నిరుత్సాహ పరిచేవారని అన్నారు. కానీ, తన భవిష్యత్ కి పదో తరగతి మార్కులు కొలమానం కాదని.. కష్టపడి చదివితే ఉన్నత విద్యనభ్యసించడం పెద్ద కష్టం ఏం కాదని తాను నిరూపించానని అన్నారు.
2012 బ్యాచ్ కు చెందిన సుమేరా.. ప్రస్తుతం భరుచ్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. యూపీఎస్సీలో ర్యాంకు సాధించి భేష్ అనిపించుకున్నారు. కొంతకాలం ఆయన ఉపాధ్యాయుడిగా కొనసాగారు. ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్.. సుమేరా మార్కుల లిస్ట్ తో పాటు ఆయన ఫోటోను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆయనలాంటి బ్యాక్ బెంచ్ విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చాయని బాధపడే విద్యార్థులకు కలెక్టర్ తుషార్ డి సుమేరా స్టోరీ ఎంతో ప్రేరణగా ఉంటుందని అవనీష్ శరణ్ అభిప్రాయపడ్డారు. కాగా, తన మార్కుల షీట్‌ను షేర్ చేసినందుకు తుషార్ సుమేరా మైక్రో- బ్లాగింగ్ సైట్‌లో మరో కలెక్టర్ అవనీష్ శరణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
भरूच के कलेक्टर तुषार सुमेरा ने अपनी दसवीं की मार्कशीट शेयर करते हुए लिखा है कि उन्हें दसवीं में सिर्फ पासिंग मार्क्स आए थे.
उनके 100 में अंग्रेजी में 35, गणित में 36 और विज्ञान में 38 नंबर आए थे. ना सिर्फ पूरे गांव में बल्कि उस स्कूल में यह कहा गया कि यह कुछ नहीं कर सकते. pic.twitter.com/uzjKtcU02I
— Awanish Sharan (@AwanishSharan) June 11, 2022
విద్యార్థులే కాదు.. తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారి ఆలోచనా విధానం కూడా ఎంతో మారాల్సి ఉంది. ఏదో ముక్కున పెట్టుకుని మార్కులు సాధిస్తే సరిపోతుంది.. మా వాడు లైఫ్ లో సెటిల్ అయిపోతాడు అనే భ్రమల్లో బతకకండి. ముందు మీ పిల్లలకు ఏం ఇష్టమో తెలుసుకోండి. మీ బంధువుల పిల్లాడు ఇంజినీరింగ్ చేరాడు కాబట్టి మీ వాడు కూడా ఇంజీనీరింగే చదవాలి అనుకోవద్దు. ఏదో ఒక ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయని మాటలతో మీ పిల్లల పసి హృదయాలకు గాయం చేయకండి. అక్షరం ముక్క రాకపోయినా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్లే అద్భుతాలు సృష్టిచగలరు.. బ్యాక్ బెంచర్స్ ఎందుకు పనికిరారు అనే అపోహను కూడా దూరం చేసుకోండి. ‘ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే బోర్డు మాత్రమే చూడగలరు.. అదే బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే ప్రపంచాన్నే చూడచ్చు’. అనే డైలాగ్ ను ఒకసారి గుర్తు చేసుకోండి. బ్యాక్ బెంచర్ నుంచి ఐఏఎస్ గా ఎదిగిన తుషార్ డి సుమేరా సాధించిన విజయం, ఎదిగిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.