కొత్తగా కారు నేర్చుకునేవాళ్లకు పార్కింగ్ చేయడం, రివర్స్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా తక్కువ స్పేస్ ఉన్నప్పుడు కొత్తగా బండి నడిపేవారికి పార్క్ చేయడం, తిప్పడం అంత ఈజీ కాదు. అందుకే కొత్త కారును కొనేముందు ఏదైనా ఓ పాత కారును తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తుంటారు. కొత్తగా కారు నడిపేవారు బ్రేక్, ఎక్స్‌లేటర్‌ను సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతారు. దీంతో అదుపు తప్పి వేరే వాహనాలను, మనుషులను ఢీకొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరహా ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. ఒక కారు ఢీకొట్టడంతో 8 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన కోయంబత్తూరులోని వన్నారపేటలో ఈనెల 18న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వన్నారుపేటకు చెందిన సయ్యద్ మహ్మద్ అనే వ్యక్తి ఇటీవలే కొత్త కారు కొన్నాడు. ఆ వాహనాన్ని తన ఇంటి వద్ద పార్కింగ్ చేస్తున్నాడు. అప్పుడే రైపుద్దీన్ బషీద్ అనే బాలుడు అటు వైపుగా సైకిల్ మీద వెళ్తున్నాడు. దీంతో కారు యజమాని అయిన సయ్యద్.. బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్‌ను తొక్కాడు. దీంతో ఆ చిన్నారి కారు, ఎదురుగా ఉన్న ఒక గోడ మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న కొందరు స్థానికులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు ఓనర్ అయిన సయ్యద్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు.