మనిషి కష్టపడి సంపాదించే ప్రతి సొమ్ము ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు.. కానీ దొంగలు మాత్రం కొట్టేసిన సొమ్ముతో జల్సా చేసుకుంటారు. ఓ దొంగ మాత్రం అందరికీ భిన్నంగా తాను కొట్టేసిన డబ్బు పేద ప్రజలకు పంచుతూ మానవత్వం చాటుకున్నాడు. ఒకప్పుడు రాబిన్ హుడ్ అనే వ్యక్తి సంపన్నులను దోచుకొని పేద ప్రజలకు పంచి పెట్టేవాడని ఎన్నో కథల్లో విన్నాం. జెంటిల్‌మేన్, కొండవీటి దొంగ, కిక్ లాంటి చిత్రాల్లో ఇదే కాన్సెప్ట్ ఉంటుంది.. ఉన్నవాళ్లను దోచేయ్.. లేని వాళ్లకు పంచేయ్. ఓ యువకుడు దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బుతో ఫుట్ పాత్, రైల్వే స్టేషన్లలో దీన స్థితిలో ఉన్నవారికి బట్టలు, ఆహారాన్ని అందించేవాడు. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడుకు ఎగ్మోర్ కు చెందిన అంబురాజ్ అనే యువకుడు గత ఐదు సంవత్సరాల నుంచి చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఉదయం పూట కూలీగా పనిచేస్తూ రాత్రి పూట దొంగ అవతారం ఎత్తేవాడు. గత ఐదు సంవత్సరాల్లో చెన్నై నగర శివారుల్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు పగులగొట్టి డబ్బు, బంగారం, విలువైన వస్తువులు దొంగతనం చేసేవాడు అంబురాజ్. అలా ఎత్తుకెళ్లిన సొమ్ము అమ్మగా వచ్చిన డబ్బుతో తన ఖర్చులకు పోగా మిగిలిన డబ్బుతో ఆహారం, బట్టలు కొని ఎగ్మోర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనాథలకు, బిక్షగాళ్లకు పంచిపెట్టేవాడు. విచిత్రం ఏంటంటే అంబురాజ్ చోరీ చేసిన ఇళ్లలోనే మళ్లీ చోరీలు చేస్తూ తప్పించుకునేవాడు.
ఈ క్రమంలో తంబారం ప్రాంతానికి చెందిన వరదరాజన్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాడు. తిరిగి వచ్చి ఇంట్లో చూస్తే బీరువా లాకర్ ఓపెన్ చేసి ఉంది. అందులో ఉన్న డబ్బు, నగలు చోరీ అయ్యాయి. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు వరదరాజన్. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి అందులో ఉన్నది పాత నేరస్తుడు అంబురాజన్ అని గుర్తించారు. పక్కా ప్రణాళికతో అంబురాజ్ ని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వద్ద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేవారు. విచారణలో దొంగిలించిన సొమ్ము అమ్మగా వచ్చిన డబ్బుతో నిరాశ్రుయులకు, ఆకలితో ఉన్న పేదలను ఆదుకుంటున్నట్లు తెలిపాడు అంబురాజ్.
తంబారం కోర్టులో ప్రవేశ పెట్టే సమయంలో కూడా కోర్టు దగ్గర ఆకలితో ఉన్నవారిని పిలిచి ఆహారం, దుస్తులను అందించాడు అంబురాజ్. తనకు దొంగతనం చేసిన తర్వాత ఎలాంటి పశ్చాతాపం ఉండదని.. అవి పేదలకు పంచిపెట్టే సమయంలో వచ్చే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుందని అంటున్నాడు అంబురాజ్. ఇదిలా ఉంటే.. అంబు రాజ్ గురించి ఎంక్వేయిరీ చేస్తున్న సమయంలో ఎగ్మోర్ రైల్వే స్టేషన్ సమీపంలో బిచ్చగాళ్లకు, అనాథలకు అంబురాజ్ తరుచూ ఆహార పొట్లాలు, బట్టలు అందించడం తాము చూశామని కొంతమంది స్థానికులు పోలీసులకు తెలిపారు.