‘గోపాలా గోపాలా’ సినిమాలో దేవాలయంలో విగ్రహంపై పాలను పోయడంపై ఓ సన్నివేశం ఉంటుంది. దేవుడికి అభిషేకం చేసే పాలను యాచకుడికి ఇస్తాడు వెంకటేశ్. అలా అతని ఆకలి తీర్చగలిగానంటూ వెంకటేశ్ భావోద్వేగంతో డైలాగ్ చెప్తాడు. అచ్చు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తే గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్నాడు. దాదాపు తొమ్మిదేళ్లుగా దేవాలయాల్లో వృథాగాపోయే పాలను సేకరించి బస్తీల్లోని పేద ప్రజలకు పంచుతున్నాడు ఓ డెబ్బైఏళ్ల వృద్ధుడు. ఎంతో మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాడు.
2012 జనవరి 26న ‘ఇండియన్ మిల్క్ బ్యాంక్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. అప్పటి నుంచి జునాగఢ్‌లో ఎంతోమంది ఆకలితీరుస్తున్నాడు. దేవాలయాల్లో వృథాగాపోయే పాలను సేకరించి వాటిని మరగబెట్టి, పంచదార కలిపి బస్తీల్లోని పేదలకు అందజేస్తాడు. పాలు నాణ్యంగా ఉన్నాయని నిర్ధరణకు వస్తేనే వాటిని పంపిణీ చేస్తాడు. ఎండావానా తేడా లేకుండా ఎప్పుడూ సైకిల్‌పై జునాగఢ్ మొత్తం తిరుగుతూ బస్తీల్లోని పేదలకు పాలు పంచుతుంటారు. అతని పేరు అడిగా ఎప్పుటూ చెప్పడంట. ‘ఓన్లీ ఇండియన్’ పేరుతోనే అందరికీ సుపరిచితం. ఎవరు పేరడిగినా అదే పేరు చెప్తారు. అలా పిలిస్తేనే తనకు ఇష్టమని చెప్తుంటాడు.
‘శ్రావణ మాసంలో దేవాలయాల్లో పాలు చాలావరకు వృథాగా పోయి కాల్వలో కలుస్తుంటాయి. అలాంటి పాలను సేకరిస్తాను. చాలా దేవాలయాల్లో నేను పాల క్యానులు ఏర్పాటు చేశాను. భక్తుల్లో కొందరు వారు తెచ్చిన పాలలో కొన్ని దేవుడికి అభిషేకం చేసి.. కొన్ని పాలు నేను పెట్టిన క్యానుల్లో పోస్తారు’ అని ‘మిల్క్ మ్యాన్ చెప్తున్నారు. రోజుకు 5 నుంచి దాదాపు 30 లీటర్ల పాలను సేకరిస్తుంటారు. వాటిని శుద్ధి చేసి ముఖ్యంగా 11 ఏళ్లలోపు పిల్లలు, మహిళలు, వృద్ధులకు అందిస్తుంటాడు మిల్క్ మ్యాన్. ‘భక్తుల నమ్మకాన్ని నేను తప్పు పట్టను. కానీ, అలా పాలు వృథాగా పోవడం కంటే కొందరికైనా పౌష్టికాహారంగా మారితే బాగుంటుందని ఇలా చేస్తున్నా’ అని చెప్తున్నారు జునాగఢ్ మిల్క్‌మ్యాన్.