రాబర్ట్ డాల్ అంటే మనకు పెద్దగా తెలియదు కానీ, జర్మనీలోని వారికి ఈ బొమ్మ గురించి బాగా తెలుసు. ఆ బొమ్మ పేరు చెబితే ఉలిక్కిపడతారు. ఎందుకంటే ఈ బొమ్మ దుష్టశక్తులకు నిలయమని వారు నమ్ముతారు. అది ఎక్కడ ఉంటే అక్కడ వినాశనం తప్పదని భావిస్తారు. వారి నమ్మకానికి బలం చేకూర్చే సంఘటనలు కూడా చాలా జరిగాయి. అది ఉన్న ఇంట్లో వారికి కారు ప్రమాదాలు జరగటం, ఎముకలు విరిగిపోవటం, ఉద్యోగాలు కోల్పోవటం, భార్యాభర్తలు గొడవలు పడి విడాకులు తీసుకుని విడిపోవటం లాంటి వి సంభవించాయి. దీంతో ఆ బొమ్మను మ్యూజియంలో పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ బొమ్మ జర్మనీకి చెందిన రాబర్ట్ యూగెన్ ఓట్టోకు చెందింది. అతడి పేరు మీద గానే దానికి రాబర్ట్ బొమ్మ అని పేరు వచ్చింది. రాబర్ట్ చిన్నతనంలో పుట్టినరోజు బహుమతిగా దీన్ని రాబర్ట్ తాత అతడికి ఇచ్చాడు. ఇది 1904-06 మధ్య కాలంలో జరిగింది. ఆ బొమ్మను రాబర్ట్ ఎంతో ప్రేమించాడు. దానికి ఓ మనిషికి ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చే వాడు. ఏకంగా దాని కోసం ఓ ఇంటిని అన్ని వసతులతో ఏర్పాటు చేశాడు. దాన్ని తనతో పాటు ప్రతీ చోటుకు తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఇంటి చుట్టుపక్కలి వారు ఆ బొమ్మ తేడాగా ఉందని గుర్తించారు. అది ఇంట్లో అటు ఇటు కదలటం వారి కంట పడింది.
రూములో ఏదైనా సంభాషణ జరుగుతున్నపుడు దాని ముఖ కవలికలు మారుతున్నట్లు కనుగొన్నారు. రాబర్ట్‌కు పెళ్లైన తర్వాత కూడా అతడు బొమ్మకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. భార్య దాన్ని అసహ్యించుకునేది. భార్యాభర్తలు చనిపోయిన తర్వాత వారి ఇంటిని 1974లో మిర్టిల్ ర్యూటర్ అనే మహిళ కొనుక్కుంది. ఇక అప్పటినుంచి రాబర్ట్ బొమ్మను ఆమే చూసుకునేది. ఆమెకు కూడా బొమ్మ ద్వారా వింత అనుభవాలు ఏర్పడటంతో దాన్ని మ్యూజియానికి ఇచ్చేసింది. ప్రస్తుతం ఆ బొమ్మ మ్యూజియంలో ఉంది.