సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ శాండల్ వుడ్ స్టార్ ఉదయ్ హుట్టినగడ్డే.. జూన్ 2న కన్నుమూశారు. 61 ఏళ్ళ వయసులో నటుడు ఉదయ్ బెంగుళూరు(రాజాజీనగర్)లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొన్నేళ్లుగా నరాలు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ చనిపోయినట్లు సినీవర్గాల సమాచారం. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఉదయ్ హుట్టినగడ్డే.. 1987లో ‘ప్రారంభ’ అనే చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత జయభేరి, అమృత బిందు, శివయోగి అక్కమహదేవి, క్రమా, ఉండు మంచి కొండు హోదా, క్రమా, అగ్నిపర్వ, మరియు శుభ మిలనా వంటి చిత్రాలలో నటించారు. కెరీర్ పరంగా రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్‌నాగ్, అనంత్ నాగ్ మరియు టైగర్ ప్రభాకర్ లాంటి సూపర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చివరిగా పలు కారణాల వలన ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇదిలా ఉండగా.. ఉదయ్ హుట్టినగడ్డే నటనతో పాటు ఫోటోగ్రఫీ బిజినెస్ స్టార్ట్ చేసి కర్ణాటకలో ఎన్నో ఫోటో ల్యాబ్ లను ప్రారంభించారు. ముఖ్యంగా మల్నాడు ప్రాంతానికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినందుకు ఆయన ‘హార్ట్స్ ఆఫ్ ది పీపుల్’ అవార్డు అందుకున్నారు. చిక్కమగళూరు ప్రాంతంలోని బసరికట్టే ప్రాంతానికి చెందిన ఉదయ్ హుట్టినగడ్డే మృతితో కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.