ప్రముఖ సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ ప్రశాంత్ అకృత్యాలు ఒక్కొక్కొటిగా బయటకు వస్తున్నాయి. అతడి వల్ల వేధింపులకు గురైన యువతులు తమ బాధను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ప్రశాంత్ తమను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాగా వేధించాడని వారు పేర్కొంటున్నారు. అసభ్యంగా మెసెజ్‌లు చేస్తూ ఇబ్బంది పెట్టాడని వెల్లడించారు. ప్రశాంత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమతో జరిపిన చాటింగ్ తాలూకా స్క్రీన్ షాట్లను పోస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శరణ్య అనే వర్థమాన మోడల్ కూడా ప్రశాంత్ వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘ నేను అతడు ఒకే కాలేజ్‌లో చదువుకున్నాం. అతడు నా జూనియర్. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యాడు.
ఇద్దరం కలిసి ఓ ఫొటోషూట్ కూడా చేశాం. ఇక అప్పటినుంచి అతడు నాకు మెసెజ్‌లు చేయటం మొదలుపెట్టాడు. మొదట్లో అక్కా అని పిలిచేవాడు. తర్వాత అక్కా అని పిలవటం మానేశాడు. నా శరీరం గురించి మాట్లాడేవాడు. నేనంటే తనకు ఇష్టమని, నాలాంటి అమ్మాయే అతడికి కావాలని అనేవాడు. దీంతో నేను అతడ్ని పట్టించుకోవటం మానేశాను. ఈ నేపథ్యంలోనే రెడ్డిట్ ద్వారా నాలాగే చాలా మందిని అతడు ఇబ్బందులకు గురి చేశాడని తెలిసింది. మగాళ్లు తమ ఫీలింగ్స్‌ను వ్యక్తపరచకూడదు అని నేను చెప్పట్లేదు. అవతలి వ్యక్తి మనసేంటో తెలుసుకుని మసులుకోండి.
ఇప్పటికైనా ఇలాంటి వాళ్లు మారతారని భావిస్తున్నాను. ఇది ఎక్కువ మందికి చేరాలని ఆశిస్తున్నాను ’’ అని అన్నారు. ఇక ఇదే విషయంపై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించారు. ఆమె తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ చెన్నైకి చెందిన ప్రముఖ వెడ్డింగ్ ఫొటో గ్రాఫర్ యువతుల్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్నట్లు తెలియ వచ్చింది. ఇలాంటి వారు ఎప్పుడు మారతారో?..’’ అని పేర్కొంది. ప్రస్తుతం ప్రశాంత్ వేధింపుల వార్తలు తమిళ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అతడు చాలా మంది వర్ధమాన మోడల్స్‌ను టార్గెట్ చేసి వేధించినట్లు తెలుస్తోంది.