నటి ప్రత్యూష ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2002లో జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఆమె సడెన్ గా ప్రియుడితో కలిసి ఆత్మహత్యా హత్నం చేసింది. ఈ ఘటనలో ప్రత్యూష చనిపోగా ఆమె ప్రియుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికి ఆమె వయసు 20 ఏళ్లు. అప్పట్లో ఆమె మరణానికి కారణం ఇదేనంటూ ఎన్నో వదంతులు వచ్చాయి. ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డితో పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు విషం తాగారని.. ఓ వైపు ఆరోపణలు ఉన్నాయి. ఈ నటి కథ ఇప్పటికీ ఓ మిస్టరీయే.
ఇటీవల ఈ విషయంపై ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలను బయట పెట్టారు. ఆ విషాద ఘటన జరిగి దాదాపు 20 ఏళ్ళు గడుస్తోందని తెలిపిన ఆమె, ప్రత్యూష చనిపోయే ముందు రోజు తాను ప్రేమించిన అబ్బాయి సిద్దార్థ్ రెడ్డి తో బయటకు వెళ్లిందని, అదే సమయంలో జయం సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఓకే చేసారని, ఆ ఆఫీస్ కు వెళ్లి వస్తానని చెప్పిందని తెలిపింది. అయితే అదే ఆమె చివరి మాటలు అవుతాయని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు.. ప్రత్యూషకు చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు కూడా ఆధారాలను మాయం చేసారని ఆరోపించారు.
ప్రత్యూషను మేం ముద్దుగా పింకీ అని పిలుచుకుంటాం.. ఆ రోజు ఫిబ్రవరి 23, 2002. సాయంత్రం కావొస్తోంది. తెల్లవారుజామున బెంగళూరుకి బయలుదేరాలి. కన్నడ సినిమాలో తొలి అవకాశం. ఫేషియల్ చేయించుకుంటానంటూ కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్ కెళ్లింది. ఆ సమయంలో పింకీ పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ వచ్చాడట. ఫేషియల్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశాడట. కాసేపటి తర్వాత సిద్ధార్థతో కలిసి ఓ పదిహేను నిమిషాలు బయటకెళ్ళి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది. ఇద్దరూ కలిసి సిద్ధార్థ కారులో బయటకెళ్లారు. కొద్ధి సేపటికే పింకీ దగ్గర నుంచి నాకు ఫోన్.. ‘జయం సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారని, తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్ కు వెళ్లొస్తాను..’ అని చెప్పింది. అదే చివరి మాట.
కానీ వాళ్లు మాత్రం జయం ఆఫీసుకు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్ లో ఉన్న శిరి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తానన్నదట. ఆ తర్వాత ఫోన్ తియ్యలేదట. అప్పటి వరకు ప్రతి వివరమూ సరిగ్గా సరిపోలుతూనే ఉంది. ఆ తర్వాత అంతా మిస్టరీనే. అలా పింకీ కోసం ఎదురుచూస్తుండగా రాత్రి ఏడు గంటల సమయంలో ఎవరో ఫోన్ చేసి ‘మీ అమ్మాయిని కేర్ హాస్పిటల్లో స్ట్రెచర్ మీద చూశాం..’ అని చెప్పారు. మొదట నేను నమ్మనేదు ఆ మాటలని. మరో గంటలో కేర్ హాస్పిటల్ వాళ్లే ఫోన్ చేశారు ‘మీ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది.. హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నాం..’ అని.
మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదుగా అనిపించింది. వెంటనే మా అబ్బాయితో పాటు హాస్పిటల్ కు పరుగెత్తాను. అప్పటికే ప్రత్యూష ఐసీయూలో ఉంది. మమ్మల్ని లోపలకి వెళ్లనివ్వలేదు. సిద్ధార్థ బంధువులు మాత్రం లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. కనీసం వాళ్ల ఫ్రెండ్స్ కూడా ప్రత్యూష ఎలా ఉందో చెప్పలేదు. రాత్రి పదకొండు గంటలకు మమ్మల్ని లోపలికి పంపించారు, కానీ బెడ్ కు ఐదడుగుల దూరంలో ఉంచి ఒక్క నిమిషానికే బయటకు పంపించేశారు. ఆ మరుసటి రోజు తెల్లవారి ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఒక డాక్టర్ వచ్చి ‘ప్రత్యూష మోషన్ కెళ్లింది, డ్రస్ తెస్తే మారుస్తాం’ అన్నారు. అప్పుడు నా సంతోషం చూడాలి. అమ్మయ్యా అనుకొని త్వరగాఇంటికెళ్లి డ్రస్ తీసుకొచ్చాను. అంతే.. తర్వాత పదిహేను నిమిషాలకు ‘మీ అమ్మాయి చనిపోయింది..’ అని చెప్పారు.
నాకెందుకో అనుమానం కలిగింది. విడిచిన దుస్తులను అడిగితే ‘రాత్రి మోషన్ కెళ్లినప్పుడు తీసి డస్ట్ బిన్ లో వేసేస్తారు, ఉదయాన్నే వాటిని కాల్చేస్తారు. అవి ఉండవు’ అన్నారు. కాసేపటికే పోలీసులు వచ్చారు, హిమాయత్ నగర్ సమీపంలో దొరికిందని ఒక పాయిజన్ డబ్బా చూపించారు. ‘ఇద్దరూ పాయిజన్ తీసుకున్నారు, మీ అమ్మాయి వీక్ గా ఉండడంతో చనిపోయింది’ అన్నారు. పోస్టుమార్టం అయ్యాక.. మర్నాడు ఉదయం పదకొండుకి అమ్మాయినిచ్చారు. గొంతు నొక్కినట్లు కమిలిన గుర్తులున్నాయి. ఒక వైపు నాలుగు, మరో వైపు ఒక వేలి గుర్తు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బలవంతంగా గొంతు నొక్కి నోరు తెరిపించి పాయిజన్ పోశారని నాకనిపించింది. అయితే హాస్పిటల్ వాళ్లు మాత్రం ‘ట్రీట్మెంట్ సమయంలో పాయిజన్ వామిట్ చేయించేటప్పుడు పడిన గుర్తులవి’ అన్నారు.
ఆ తరువాత మా ఊరికి తీసుకెళ్లి ప్రత్యూషను మా సంప్రదాయం ప్రకారం దహనం చేశాం. కానీ ఖననం చేసి ఉంటే బావుండేదని ఇప్పటికీ బాధపడుతున్నాను. రీ పోస్టుమార్టమ్ చేస్తే నిజాలు బయటపడేవి. మా అమ్మాయి పాయిజన్ ఎందుకు తీసుకుంది.. అన్న ప్రశ్న నన్ను తొలిచింది తప్ప, అత్యాచారం అనే ఊహే రాలేదు నాకు. దహనం అయిన తర్వాత టీవీల్లో వార్తలు చూసే వరకు నాకు ఆ ఆలోచనే రాలేదు. అప్పట్లో మీడియా ఇప్పటిలా లేదు. ఇన్ని చానళ్లు ఉండి ఉంటే వెంటనే విషయం బయటకు పొక్కి ఉండేది. వార్తలు చూసిన వెంటనే, కర్మకాండలు కూడా జరగకముందే హైదరాబాద్ వచ్చేశాను. ఫైనల్ గా నాకు అనిపించింది ఏంటంటే.. నలుగురు.. ఐదుగురు.. కలిసి ప్రత్యూషను గెస్ట్ హౌస్ లకు మార్చి నరకయాతన చూపించారని అనిపించింది. న్యాయం కోసం పోరాడుతోన్న సమయంలో కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎంత తిరిగినా న్యాయం జరగదని బెదిరించే వారు. అప్పటి నుంచి మొదలైన నా న్యాయపోరాటం ఇంకా సాగుతూనే ఉంది. తమ కుమార్తెను హింసించిన వారికి కచ్చితంగా ఆ దేవుడే శిక్ష విధిస్తాడు..” అని తెలిపారు.