ఇటీవల కాలంలో వివిధ కారణాలతో విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు అనుమానస్పద స్థితిలో మరణిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికి విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం.. వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతుంది. తాజాగా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో శ్రావణి అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి తన హాస్టల్ గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో శ్రావణి ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతోంది. అయితే శ్రావణి ఆత్మహత్యపై విద్యార్ధి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరొవైపు శ్రావణి మృతిని కాలేజి యాజమాన్యం గోప్యంగా ఉంచింది. మృతురాలి స్వస్థలం నిజామాబాద్ జిల్లా. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. గత కొంతకాలం డిప్రెషన్లో ఉన్న శ్రావణి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం కాలేజీ సిబ్బంది, హాస్టల్ సిబ్బంది నుంచి సమాచారం సేకరిస్తున్నారు. శ్రావణి ఆత్మహత్య చేసుకునే ముందు వరకు చేసిన యాక్టివిటీస్ గురించి పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.