మనిషి జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటు జీవితంలో ముందుకు సాగే వారు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు మాత్రం తమకు వచ్చిన సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తుంటారు. అందుకే క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుని కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేశారు. ఇలా కొందరు తల్లిదండ్రులు తీసుకునే అనాలోచిత నిర్ణయం కారణంగా వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. తాజాగా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఓ లేఖ అందరి హృదయాలను కలచి వేసింది. “కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను” అంటూ రాసిన లేఖ ప్రతి ఒక్కరి హృదయాలను కదలించింది. అలా తన పిల్లలకు లేఖ రాసి.. ఆ తరువాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన కలమడి ప్రసాద్ బాబు(35), సుకన్య(28) దంపతులు. వీరికి అక్షిత, ఐశ్వర్య, అరవింద్, అవినాష్ అనే నలుగురు సంతానం ఉన్నారు. ప్రసాద్ బాబు బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అలా వారి సంసారం కొంతకాలం పాటు హాయిగా సాగింది. అయితే ఆ దంపతుల మధ్య కొంతకాలం నుంచి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు వారాల కిందట వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సమయంలో సుకన్య క్షణికావేశంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రసాద్.. భార్యతో గొడవ పడే వాడు కానీ.. ఆమె మరణం అతడికి తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తన భార్యలేని జీవితం వృథా అనుకుని.. తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో స్థానిక అంగన్ వాడీ సిబ్బంది ద్వారా పిల్లలను గత నెల 29న ఐసీడీఎస్ అధికారులకు అప్పగించాడు. అంతేకాక పిల్లల తల్లిలేనందున.. వారిని తాను పోషించలేనని, మీరే చూసుకోవాలని అధికారులకు లేఖ రాసిచ్చాడు. ఐసీడీఎస్ అధికారులు కూడా పోలీసుల సమక్షంలో ఆ నలుగురు పిల్లలను తీసుకుని రాజంపేట బాలసదన్ లో చేర్చారు. ఆదివారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రసాద్ బాబు పిల్లల వద్దకు వెళ్లాడు. తాను చనిపోవాలని నిర్ణయించుకుని వారిని కడసారి చూసేందుకు అక్కడి వెళ్లి కొంత సమయం గడిపాడు. వారికి కొన్ని తినుబండారులు ఇప్పించి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అనంతరం సోమవారం ఉదయం రైల్వే కోడురులోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను తమకు అప్పగించే ముందురోజు నుంచే తాను చనిపోతానని, పిల్లలను భద్రంగా చూసుకోవాలంటూ ప్రసాద్ కోరినట్లు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. ఆ సమయంలో ఆయనకు చావే పరిష్కారం కాదని కౌన్సిలింగ్ ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందని వారు తెలిపారు. మరి.. ఇలా దంపతులు గొడవలు పడి.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుని పిల్లలను అనాథలను చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.