ప్రేమించిన వారి పేర్లను గుండెలపైనో.. లేక శరీరంలోని ఇతర భాగంలోనో పచ్చగా పొడిపించుకోవటం సాధారణంగా జరుగుతుంటుంది. వారి మీద మనకు ఉన్న ప్రేమను పచ్చబొట్టు ద్వారా చెరిగిపోకుండా చేసుకుంటాము. అయితే, ఓ యువతి మాత్రం తనను మోసం చేసిన ప్రియుడి ముఖాన్ని తన బుగ్గలపై పచ్చపొడిపించుకుంది. ఇకపై ప్రియుడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యారల్లీ న్యామ్ అనే యువతి లారా అనే యువకుడు గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం న్యారల్లీ గర్భం దాల్చించి.
పది రోజుల క్రితం ఆమెకు నొప్పులు రావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో ఉండగానే.. ఆమెకు ఓ చేదు నిజం తెలిసింది. తన ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గుర్తించింది. ఆ తర్వాత ఆసుపత్రినుంచి ఇంటికి వచ్చేసింది. తనను మోసం చేసిన ప్రియుడి గుర్తుగా అతడి బొమ్మను బుగ్గలపై పచ్చ పొడిపించుకుంది. దీనిపై న్యారల్లీ మాట్లాడుతూ.. ‘‘ మేము మంచి ఫ్యామిలీ అనుకుంటూ ఉండేదాన్ని. అతడి బిడ్డకు జన్మనిచ్చాను. ఓ ఇళ్లు కూడా కొనుక్కున్నాము.
అంతా చాలా అందంగా ఉందనుకుంటున్న సమయంలో ఆ విషయం తెలిసింది’’ అని చెప్పుకొచ్చింది. దీనిపై ఆమె ప్రియుడు లారా కూడా స్పందించాడు. ‘‘ తను ఎందుకిలా చేస్తోందో నాకు అర్థం కావటం లేదు. నేను మోసం చేస్తున్నానని తనకు తెలిసి పోయింది. ఇకపై ఇలాంటివి జరగవని నేను మాటిచ్చాను. కానీ, తను నాతో ఉండటానికి ఇష్టపడటం లేదు’’ అని అన్నాడు. ప్రస్తుతం న్యారెల్లీ తన బుగ్గపై ప్రియుడి ట్యాటూ వేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.