కొన్ని రోజుల క్రితం అమెరికాలో వరంగల్‌కు చెందిన తెలుగు విద్యార్థిని గుళ్లపల్లి పావని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పావని కన్నుమూసింది. బుధవారం ఉదయం పావని మృతదేహం వరంగల్‌కు చేరుకుంది. నవ్వుతూ అమెరికాకు వెళ్లిన తమ కూతురు శవంగా మారి ఇంటికి రావటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బంధువులు సైతం పావనిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మా నిన్ను చూడటానికి చుట్టాలొచ్చారు లేమ్మా.. లేచి వాళ్లతో మాట్లాడమ్మా అంటూ పావని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. అలా ఏకధాటిగా ఏడుస్తున్న ఆమెను ఆపటం ఎవ్వరి వల్లా కాలేదు. భర్త ఓదార్చటానికి ప్రయత్నించినా ఆమె ఆగలేదు. కూతుర్ని తల్చుకుని వెక్కివెక్కి ఏడ్చింది. బుధవారమే పావని మృతదేహానికి అంతిమక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నారు. పావని భౌతిక దేహానికి నివాళులు అర్పించారు. కాగా, వరంగల్‌కు చెందిన రమేష్, కల్పన గారాలపట్టి పావని. పావనికి విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని కోరిక. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు బయలుదేరివెళ్లింది. కూతురిని విడిచి ఉండటం ఇష్టం లేకపోయినా.. ఆమె భవిష్యత్తుకోసం ఆలోచించి తల్లిదండ్రులు పంపించారు. అయితే, ఈ నెల 25న పావని అమెరికాలోని కనెక్టికట్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలోనే ప్రాణాలు విడిచింది. దాదాపు 9 రోజుల తర్వాత పావని మృతదేహం వరంగల్‌కు చేరుకుంది.