క్రికెట్‌లో సాధారణంగా ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల మధ్య, వారి అభిమానుల మధ్య వైరం సహజమే. కానీ భారత జట్టులో మాత్రం విడ్డూరంగా సొంత ఆటగాళ్ల అభిమానుల మధ్యనే అతి పెద్ద వైరం. ఇది ఎంతలా పెరిగిందంటే.. ఆ ఆటగాళ్ల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. జరుగుతోంది కూడాను. ఆ ఆటగాళ్లు ఎవరో కాదు.. టీమిండియా సారధి రోహిత్ శర్మ. మరొకరు మాజీ సారధి విరాట్ కోహ్లీ. వీళ్లిద్దరి మధ్య వైరం ఉందా.. లేదా అన్నది బయటి ప్రపంచానికి తెలియకపోయినా వీళ్ల అభిమానులు మాత్రం నిత్యం గొడవపడుతుంటారు.
ఈ విషయపై మీడియా వీరిద్దరిని ఎప్పుడు ప్రశ్నించినా.. అలాంటిదేమీ లేదని, తామిద్దరం మంచి స్నేహితులమని చెప్తుంటారు. తాజగా. ఇదే ప్రశ్న విరాట్ కోహ్లీకి మరోసారి ఎదురైంది. తాను ఏం చెప్పాడో చూడండి. టీమిండియా సారధి రోహిత్ శర్మతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పిన విరాట్ కోహ్లీ, ఐసీసీ టోర్నీలు గెలవడమే తామిద్దరి లక్ష్యమని చెప్పుకొచ్చాడు. ఇక మైదానంలో జరిగే విషయాలను ప్రస్తావిస్తూ.. కొన్నిసార్లు రోహిత్‌కు నేను సలహాలు ఇస్తాను.. కొన్నిసార్లు తాను నాకు సలహాలు ఇస్తాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు మా మధ్య ఇదే జరుగుతుంది. ఏదేమైనా మేం ఇద్దరం బిగ్ టోర్నీలు గెలవడంపైనే ఫోకస్ పెట్టాం..’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Unforgettable two Sixes by @imVkohli against Pakistan yesterday.
Cherishing these moments for lifetime.
🫡🫡
#INDvsPAK2022 #T20WorldCup2022 pic.twitter.com/Xaqia4SlT3— Waris Pathan (@warispathan) October 24, 2022
కాగా, టీ20 ప్రపంచకప్ 2022లో విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. పాకిస్థాన్‌పై విరోచిత పోరాటంతో అద్భుత విజయాన్నందించిన విరాట్.. నెదర్లాండ్స్‌తోనూ అదే జోరును కొనసాగించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. ఆసియాకప్ 2022 వరకు ఫామ్‌తో సతమతమైన విరాట్.. నెల రోజుల సుదీర్ఘ విరామం అనంతరం రఫ్ఫాడిస్తున్నాడు. ముఖ్యంగా ఒత్తిడిలో రాణిస్తూ మునుపటి కోహ్లీని తలపిస్తున్నాడు. ఇక భారత జట్టు తదుపరి పోరులో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఆదివారం(అక్టోబర్ 29న) జరగనుంది.