క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. అదీ కాక జట్టు ప్రయోజనాలకు ఆసిస్ బోర్డు పెద్ద పీట వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి అనేక ఉదాహరణలు చరిత్రలో ఉన్నాయి. జట్టులో ఎంత అనుభవం ఉన్న ఆటగాడైన ఫామ్ కోల్పోతే.. తీసి పక్కన పెట్టడం ఆసిస్ బోర్డుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న స్టార్ బ్యాటర్ అయిన స్టీవ్ స్మిత్ ను టీ20 వరల్డ్ కప్ 2022 కు పక్కన పెట్టింది ఆసిస్ బోర్డు. టెస్ట్, వన్డేల్లో కీలక ప్లేయర్ గా ఉన్న స్మిత్ ను ప్రపంచ కప్ కు ఎంపిక చేయకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా టీ20 వరల్డ్ కప్ లో ప్లేస్ పై స్పందించాడు స్మిత్. మరిన్ని వివరాల్లోకి వెళితే..
”బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి” అన్న సామెత క్రీడా ప్రపంచానికి సరిగ్గా సరిపోతుంది. ముఖ్యంగా క్రికెట్ కు.. క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన ఆటగాడు కూడా కొన్ని సార్లు ఫేడ్ అవుట్ అవ్వక తప్పదు. ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు ఆసిస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. ప్రపంచంలోని అత్యున్నత బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సచిన్, కోహ్లీ, పాంటింగ్ లాంటి దిగ్గజాల రికార్డులను అధిగమించగల ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే.. అందులో ముందుగా వినిపించే పేరు స్టీవ్ స్మిత్ దే. అయితే టెస్టు, వన్డే బ్యాటర్ గా ముద్ర పడిన స్మిత్ కు.. టీ20 జట్టులో చోటు దొరకడం కష్టంగా మారింది. అదీ కాక టీమ్ లోకి టిమ్ డేవిడ్ లాంటి యువ ఆటగాళ్లు రావడంతో స్మిత్ కు మరిన్ని కష్టాలు ఎదురైయ్యాయి. అయితే మాథ్యూవేడ్, స్టోయినిస్, టిమ్ డేవిడ్, ఫించ్ గాయాల బారిన పడటంతో స్మిత్ ఆఫ్గాన్ తో మ్యాచ్ లో ఆడటం దాదాపుగా ఖాయం అయినట్లే అని తెలుస్తోంది.
దాంతో టీ20 ప్లేస్ మెంట్ పై తాజాగా స్మిత్ స్పందిస్తూ..”నేను ఎక్కువగా టెస్ట్, వన్డే క్రికెట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతోనే టీ20 ల్లో చోటు దక్కించుకోలేక పోతున్నాను. అదీ కాక ఫార్మాట్ కు తగ్గట్లుగా ఆడినప్పుడే ఆటగాడి గొప్పతనం బయటపడుతుంది. కోహ్లీ మెల్ బోర్న్ లో ఆడిన ఇన్నింగ్స్ చాలా గొప్పది. సహచర బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ చేరుతున్న క్రమంలో ఒంటరిగా పోరాడాడు. నేను కూడా ఇలాంటి ఇన్నింగ్స్ లు చాలా ఆడగలను. నాకూ ఓ అవకాశం ఇవ్వండి” అని స్మిత్ పేర్కొన్నాడు. మిగిలిన దేశాల గ్రౌండ్స్ కంటే ఆసిస్ గ్రౌండ్స్ పెద్దవివని, దాంతో మంచి మంచి హిట్టర్లు సైతం ఇక్కడ సిక్సర్లు కొట్టడానికి ఇబ్బందులు పడతారని స్మిత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక్కడి పిచ్ లపై ఎలా బౌండరీలు సాధించాలో నాకు అనుభవం ఉందని స్టీవ్ ధీమా వ్యక్తం చేశాడు. నాకున్న అనుభవంతో జట్టుకు హిట్టర్ గా, ఫినిషర్ గా బాధ్యతలను కూడా నిర్వర్తిస్తానని స్మిత్ పేర్కొన్నాడు.