ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న పొట్టి వరల్డ్ కప్ 2022లో మ్యాచులన్నీ వర్షార్పణం అవుతున్నాయి. ఇప్పటికే 6 మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో సెమీస్ చేరాలంటే పెద్ద జట్లకు తలకు మించిన భారమమవుతోంది. ముఖ్యంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐర్లాండ్ చేతిలో ఓడి ఇంగ్లాండ్ ఈ దుస్థితి తెచ్చుకుంటే, జింబాబ్వే చేతిలో ఓడి పాకిస్తాన్ ఈ పరిస్థితి తెచ్చుకుంది. దీంతో సెమీస్ చేరే 4 జట్లు ఏవన్నది? ఒక మిస్టరీగా మారింది. అయితే భారత్ మాత్రం సెమీస్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019 వన్డే వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవనుందా? అన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అదే జరిగితే భారత్ కు గండం పొంచివున్నట్లే.
మ్యాచులన్నీ సక్రమంగా జరిగితే ఈ పాటికే సెమీస్ చేరే జట్లపై ఒక స్పష్టత వచ్చేది. వర్షం అంతరాయం పెద్ద జట్లకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. చిన్న జట్లతో అలవోకగా గెలిచి సెమీస్ చేరతామనుకున్న ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు, ఇప్పటికే అవకాశాలు దిగజార్చుకున్నాయి. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ఫలితాలను బట్టి చూస్తే.. గ్రూప్- 2లో ఉన్న భారత జట్టు జరిగిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి 4 పాయింట్లతో టాప్ లో ఉంది. మిగిలిన 3 మ్యాచుల్లో 2 మ్యాచులు గెలిచినా, ఒకటి గెలిచి రెండు రద్దయినా టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఇక గ్రూప్- 2 నుంచి సెమీస్ చేరే రెండో సౌతాఫ్రికా ముందంజలో ఉంది. లెక్కలు తేలాల్సిందల్లా.. గ్రూప్- 1 నుంచే.
గ్రూప్- 1 నుంచి సెమీస్ చేరే అవకాశాలు న్యూజిలాండ్ కు ఎక్కువుగా ఉన్నాయి. ఆస్ట్రేలియాపై విజయం, ఆఫ్గనిస్తాన్ తో మ్యాచ్ రద్దు అవడంతో కివీస్ 3 పాయింట్లతో టాప్ లో ఉంది. మిగిలిన 3 మ్యాచుల్లో శ్రీలంక, ఇంగ్లాండ్, ఐర్లాండ్ తో తలపడాల్సి ఉంది. ఇందులో రెండు గెలిచినా, రెండు రద్దై, ఒకటి గెలిచినా సెమీస్ చేరడం పక్కా. అదే ఓడితే మాత్రం పలితాలు తారుమారవ్వచ్చు. ఇక ఆఫ్గనిస్తాన్ పై గెలిచి సెమీస్ రేసులో ఇంగ్లాండ్ అనూహ్యంగా ఐర్లాండ్ చేతిలో ఓడింది. ఆపై ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ప్రస్తుతానికి 3 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ తర్వాతి మ్యాచుల్లో న్యూజిలాండ్, శ్రీలంకలతో మ్యాచులు ఆడాల్సివుంది. దీంతో ఇంగ్లాండ్ సెమీస్ చేరడం అనేది వరుణుడి మీదే ఆధారపడి ఉంది.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటివరకు ఆడిన 3మ్యాచుల్లో ఒకటి గెలిచి, మరోటి ఓడిన, ఇంగ్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో.. మొత్తం 3 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. దీంతో ఆసీస్ సెమీస్ చేరాలంటే.. న్యూజిలాండ్ లేదా ఇంగ్లాండ్ మిగతా మ్యాచుల్లో ఓడి, ఆసీస్ అన్ని మ్యాచులు గెలవాలి. ఇది జరగడం కాని పని. ఇక గ్రూప్ -1లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ 2 పాయింట్లతో టేబుల్లో అట్టడుగున ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్-1 నుంచి అవకాశాలు ఉందల్లా.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్లకే. ఇంగ్లాండ్ పై గెలిచి రేసులో ఉన్న ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో మ్యాచులో గెలిచినా, వర్షం కారణంగా రద్దయినా వారిపంట పండినట్టే. అప్పుడు న్యూజిలాండ్ జట్టుతో కలిసి ఐర్లాండ్ సెమీస్ రావచ్చు. అదే జరిగితే 2019 వన్డే వరల్డ్ కప్ మాదిరిగా సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగొచ్చు.
ఐసీసీ టోర్నీల్లో కివీస్‌పై భారత జట్టుకు ఏ మాత్రం మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఐసీసీ టోర్నీల్లో 9 సార్లు తలపడగా 3 సార్లు భారత్, 5 సార్లు న్యూజిలాండ్ గెలిచాయి. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఇక టీ20 టోర్నీల్లో 3 సార్లు తలపడగా మూడు సార్లు న్యూజిలాండే గెలిచింది. చివరగా, టీ20 వరల్డ్ కప్ 2021లో ఈ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచులో భారత జట్టు 110 పరుగులకే పరిమితమయ్యింది. అనంతరం కివీస్ 14 ఓవర్లకే ఆ లక్ష్యాన్ని చేధించింది. అలాగే.. 2019 వన్డే వరల్డ్ కప్ తీసుకున్నా 239 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ 221 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోది, మిచెల్ సాంట్నర్ ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు ఓ పెద్ద సవాలే. దీంతో మరోసారి న్యూజిలాండ్ తో మ్యాచ్ అంటే ఫలితం పునరావృతం అవుతుందా? అన్నట్లుగా అనుమానాయిస్తున్నారు.