టీ20 ప్రపంచ కప్ ఎంత మెగా టోర్నీ అయినప్పటికీ.. టోర్నీకి ఊపు తెచ్చింది మాత్రం ఇండియా-పాక్ మ్యాచ్ అనే చెప్పాలి. క్రికెట్ చరిత్రలో భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి అంటేనే.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. అంత పిచ్చి వారికి దాయాదుల పోరంటే. అందుకు తగ్గట్లుగానే సాగింది ఇండియా-పాక్ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ అనంతరం సంచలన విషయాలు బయటపెట్టాడు.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. చివరి ఓవర్లో ఎంతో సమయస్ఫూర్తితో ఆడి టీమిండియాను గెలిపించాడు అశ్విన్. మ్యాచ్ లో చివరి బంతి గనక తన ప్యాడ్స్ కు తగిలి ఉంటే.. తర్వాత అశ్విన్ ఏం చేసేవాడో చెప్పాడు. ప్రస్తుతం ఆ విషయాలే నెట్టింట వైరల్ గా మారాయి.
భారతీయ ప్రేక్షకులకు క్రికెట్ అంటే అభిమానమే కాదు.. అదొక ఎమోషన్. ఇక ఆ మ్యాచ్ పాకిస్థాన్ తో అంటే ఏ రేంజ్ లో ఊహాగానాలు ఉంటాయో మనందరికీ తెలిసిందే. చూసే మనకే ఇంత ఉద్వేగం ఉంటే.. మరి ఆడే ఆటగాళ్లకు ఎంత భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాన్నే మ్యాచ్ అనంతరం బయటపెట్టాడు భారత స్పిన్నర్ అశ్విన్. నరాలు తెగే ఉత్కంఠ ఓవైపు, ప్రాణాలు పోయే ఒత్తిడి మరో వైపు. ఆ క్షణంలో క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ కు ఎంత ప్రెజర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. కానీ అంత ఒత్తిడిలో సైతం వైడ్ బాల్ ను ప్రశాంతంగా వదిలేసి భారత్ కు విజయాన్ని అందించాడు రవిచంద్రన్ అశ్విన్.
ఈ వైడ్ బాల్ గురించి మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ..”నవాజ్ వేసిన ఆ బంతి నా ప్యాడ్స్ కు గనక తగిలి ఉంటే.. అప్పుడు నా మనసులో మెదిలిన ఒకే ఒక ఆలోచన ఏంటంటే? వెంటనే నేను డ్రస్సింగ్ రూమ్ వెళ్లి.. నా ఫోన్ తీసుకుని ట్వీటర్లో నా క్రికెట్ కెరీర్ కు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు, నా అద్భుతమైన క్రికెట్ జర్నీ ఇంతటితో ముగిసింది అని టైప్ చేసేవాడిని” అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టే అర్ధం చేసుకోచ్చు ప్రతీ టీమిండియా ప్లేయర్ కు ఆటపై ఎంత ప్రేమో. మరీ ముఖ్యంగా పాక్ తో మ్యాచ్ అంటేనే ఓ యుద్ధంగా క్రీడానిపుణులు వర్ణిస్తారు. వారు వర్ణించినట్లుగానే భారత్-పాక్ మ్యాచ్ నిజంగా ఓ మహా సంగ్రామాన్నే తలపించిందనడంలో సందేహం లేదు.