ఆమె ఓ సాధారణ గృహిణి. భర్త అనారోగ్యం కారణంగా మరణించడంతో కుటుంబానికి ఏ లోటూ రాకుండా వెళ్లదీసుకు వస్తోంది. తన కష్టంతో కొడుకును ప్రయోజకుడిని చేసి.. ఓ ఇంటి వాడిని చేసింది. ఇక కుటుంబ పోషణకు చీటీలు నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలో ఒక్కసారిగా అనుకోని సంఘటన ఎదురైంది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తెల్లారి లేచి చూసే వరకు మంటల్లో కాలుతూ.. కనిపించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చేటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని మద్దూరు తాలూకా మారసింగనహళ్లికి చెందిన కుమార ఆరాధ్య-ప్రేమ దంపతులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అతడు బెంగళూర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య మండ్య లేడీస్ కాలేజీలో చదువుకుంటోంది. ఇక మూడు సంవత్సరాల క్రితం పక్షవాతంతో భర్త కుమార ఆరాధ్య మరణించాడు. అప్పటి నుంచి ప్రేమ ఒంటరిగానే మారసింగనహళ్లిలో చీటీలు నడిపిస్తూ.. జీవిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆమె ఒంటరిగా నిద్రిస్తుండగా.. ఇంట్లోకి చోరబడిన దుండగులు.. ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం దిండుతో ఊపిరి ఆడకుండా ఆమెను చంపేశారు.
అంతటితో ఆగని దుండగులు ప్రేమను మంచంతో సహా ఆమె బెడ్ రూంలోనే కాల్చి పరారయ్యారు. అయితే మంగళవారం ఉదయం ప్రేమ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు.. వచ్చి చూడగా మంటల్లో కాలిపోయిన ప్రేమ కనిపించింది. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జాగిలాలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం అక్కడే ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ప్రేమపై అత్యాచారం జరిపిన తర్వాతే హత్య చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మద్దూరు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.