సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో ‘పుష్ప 2‘ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో గతేడాది విడుదలైన ‘పుష్ప’ మూవీకి ఇది సీక్వెల్ గా రాబోతుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న పుష్ప 2పై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్.. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాగే తన మేనరిజమ్, యాటిట్యూడ్ లతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. దీంతో ఎప్పుడెప్పుడు పుష్ప 2 తెరమీదకు వస్తుందా అని చూస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
ఇక పుష్ప 2 షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే సినిమాపై ఇండస్ట్రీలో వర్గాలలో, సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్.. పుష్ప 2 గురించి వినిపిస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ.. తాజాగా సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ నుండి ఇప్పుడు పుష్ప ది రూల్ అనేది చూపించబోతున్నారు. కాబట్టి.. సినిమాలో రష్మికతో పెళ్లి తర్వాత పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ కి మధ్య వైరం చుట్టూనే ఉండబోతుందని అనుకుంటున్నారు. కానీ.. పుష్పకి సంబంధించి పార్ట్ 2లోనే అసలు కథ చూపించబోతున్నట్లు తెలిపాడు సుకుమార్.
ఇటీవల మీడియాతో మాట్లాడిన సుకుమార్.. పుష్ప 2కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పుష్ప 2లోనే అసలు కథ దాగుందని చెప్పిన సుక్కు.. ఎండింగ్ కి వచ్చేసరికి చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెప్పాడు. అలాగే ఈ సినిమా కథ చెప్పినప్పుడు కూడా నేను ఇందులో ఎమోషన్స్ అన్నీ పుష్ప 2 కోసమే దాచాను. అంతేగాక నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను.. పుష్ప 2లోనే అసలు కథ అంతా ఉందని సుకుమార్ చెప్పినట్లు సమాచారం. మరి అసలే అంచనాలు పీక్స్ లో ఉన్న పుష్ప 2.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ కాగా, సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.