కడప జిల్లాలో మూడు రోజుల కిందట ఓ యువతి కనిపించడం లేదంటూ ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే యువతి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలోనే అదే యువతి పెన్నా నది ఒడ్డున కుళ్లిన స్థితిలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
వైఎస్సార్ జిల్లా బీ. కోడురు మండలం మరాటిపల్లె గ్రామానికి చెందిన అనూష (20) అనే యువతి స్థానికంగా డిగ్రీ చదువుతోంది. అయితే మూడు రోజుల కిందట కాలేజీకి వెళ్లిన అనూష సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దీంతో ఖంగారుపడ్డ యువతి తల్లిదండ్రులు అంతటా వెతికారు. కానీ ఎంతకు కూడా అనూష ఆచూకి దొరకలేదు. దీంతో ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పెన్నా నది ఒడ్డున ఓ యువతి శవం కుళ్లిన స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరిన పోలీసులు ఆ యువతి శవాన్ని పరిశీలించగా.. మూడు రోజుల కిందట కనిపించకుండాపోయిన అనూష అని నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చేరవేశారు. ఘటన స్థలానికి చేరుకున్న అనూష తల్లిదండ్రులు కూతురుని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కనిపించకుండాపోయిన కూతురు శవమై తేలడంతో కనిపెంచిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అనంతరం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనూష ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైన హత్య చేసి నదిలో పడేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.