రెక్కడితే డొక్కాడని కుటుంబాలు వారివి. పగలంతా కష్టపడి పని చేస్తూ రెక్కలను ముక్కలు చేసుకుంటూ బతుకు బండిని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇటీవల ఆ మహిళా రైతు పత్తి చేనులో ఏదో పని చేస్తుంది. తనంతట తాను పని చేసుకుంటుందని కుటుంబ సభ్యులు కూడా అంతగా పట్టించుకోలేదు. ఇక చాలా సమయం అయినా ఆ మహిళా రైతు పత్తి చేను నుంచి అసలు బయటకు రాలేదు. ఏం జరిగిదంటూ కూతలు వేస్తూ ఆ మహిళను పిలిచారు. అయినా ఆ మహిళ ఎంతకు పలకలేదు. దీంతో ఆ పత్తి చేనులోకి వెళ్లి చూడగా ఆ మహిళ శవమై తేలింది. తాజాగా మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఆ మహిళా రైతు ఎలా మరణించిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది మంచిర్యాల జిల్లా కోట్లపల్ల మండలం లక్ష్మీపూర్ గ్రామం. ఇక్కడే కిష్టయ్య, మల్లక్క (50) దంపతులు నివాసం ఉంటున్నారు. గ్రామంలో వీరికి మూడెకరాల పొలం ఉంది. ఇదే పొలంలో ఆ దంపతులు ప్రతీ ఏడాది వర్షకాలంలో పత్తిపంటను పండిస్తుంటారు. ఇక ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా ఆ దంపతులు పత్తిపంటను పెట్టారు. దీంతో గత కొన్నిరోజుల నుంచి ఆ దంపతులు పంటను చూసుకుంటూ పొలం వద్దే ఉంటున్నారు. ఇక ఎప్పటిలాగానే మల్లక్క మంగళవారం తన పత్తి చేనులో అటు ఇటు తిరుగుతూ పంటను పరిశీలిస్తుంది. అయితే క్రమంలోనే తన పక్క పొలం రైతు తన మోటరు కోసం విద్యుత్ తీగను మల్లక్క పొలం మీదుగా వేయించుకున్నాడు. అయితే ఈ వైర్ తీగను చూడని మల్లక్క అలాగే ముందుకు వెళ్లింది.
దీంతో విద్యుత్ షాక్ కు గురైన మల్లక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇక మల్లక్క చాలా సేపు అయినా పత్తి చేను నుంచి బయటకు రాకపోవంతో ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు అటు ఇటు చూసి ఆమెను పిలిచారు. ఎంతకు కూడా మల్లక్క స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చేనులో వెళ్లి చూడగా.. కిందపడి మల్లక్క శవమై తేలింది. ఆ స్థితిలో ఉన్న మల్లక్కను చూసి ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. దీంతో కొద్దిసేపటి తర్వాత మల్లక్క విద్యుత్ షాక్ కు గురైందని తెలుసుకున్నారు. ఇక అనంతరం మల్లక్క భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.