‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ మొదటివారం బానే నడిచింది కానీ, 8వ రోజున హౌస్‌లో చాలా డ్రామానే నడిచింది. నామినేషన్ ప్రక్రియ కాస్తా యుద్ధభూమి వాతావరణాన్ని తలపించింది. సవాళ్లు, ఆరోపణల స్థాయి దాటిపోయి బూతుల దండకంలోకి దిగేశారు. మొదటివారం కాబట్టి వదిలేస్తున్నా అన్న కింగ్ నాగార్జున మరి ఈ యాక్షన్, ఓవరాక్షన్‌ను ఎంత వరకు మందలిస్తాడో చూడాలి. బుల్లితెర షో అంటే అందరూ కలిసి చూడాలి అనుకుంటారు.. అలాగే ఉండాలని కోరుకుంటారు. మరి తాజా ఎపిసోడ్లో సెన్సార్కట్ డైలాగులతో హౌస్ మేట్స్ ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేశారనే చెప్పాలి. బిగ్ బాస్ శృతి మించి రాగాన పడుతోందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సెబ్రిటీలు ఉన్నవారు చాలా హుందాగా ఉండాలి. వారి ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా నిలవకపోయినా పర్లేదు గానీ, నలుగురు నవ్వుకునేలా ఉండకూడదు. ప్రస్తుతం అక్కడి గొడవలు అలాగే ఉన్నాయి. ఒక్క బంగాళాదుంప కూర ఇంత రచ్చకు దారితీస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కూర షేర్ చేసుకోవచ్చుకదా అన్న విశ్వ మాటకు ఉమాదేవి రియాక్షన్ మోతాదుకు మించే వచ్చింది. బూతులను మ్యూట్ చేసినా.. వారి యాక్షన్స్ అందరికీ అర్థమయ్యేలాగానే ఉన్నాయి. నామినేట్ చేసినందుకు లోబో అంతగా ఎందుకు స్పందించాడో ఎవ్వరికీ అర్థంకాలేదు. ఇట్స్ ఏ బ్రాండ్ అన్న పదాలు వాడాల్సిన అవసరం లేదు. ఒకస్థాయికి చేరుకున్నాక సంయమనం పాటించడం నేర్చుకోవాలి. లోబో కూడా అలా బూతులు అందుకోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రతి సీజన్లో వినిపించే కామన్ పదాలు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు. ఇన్‌ఫ్లూఎన్స్ చేస్తున్నావు. ఇవి బాగా వినిపిస్తుంటాయి. బిగ్‌బాస్ హౌస్‌లో 19 ఉన్నా.. చివరికి విజేత ఒకరే. నామినేట్ చేస్తే కోప్పడటం, పొగిడితే ఉబ్బితబ్బిబ్బు కావడం తగ్గించుకోవాలి. ఎవరి ప్రణాళిక వారికి ఉంటుంది. దానికి తగినట్లుగా ఆడుతుంటారు. నువ్వు అలా ఎందుకు చేశావు అని అడగాల్సిన పని లేదు. నటరాజ్ మాస్టర్ వ్యాఖ్యలతో ఇప్పుడు హౌస్‌లో సగం జంతువులే ఉన్నాయా? అని బయట సెటైర్లు వేస్తున్నారు. నామినేట్ చేసినందుకు అంత ఫీల్ అయిపోవడం మంచి పద్ధతి కాదని అభిమానులు, ప్రేక్షకులు సూచిస్తున్నారు.
గత సీజన్లలో ఒక్క లైను ఇంగ్లీష్, హిందీ మాట్లాడితేనే దయచేసి తెలుగులో మాట్లాడండి అంటూ బిగ్ బాస్ హెచ్చరిస్తుండేవాడు. ఈ సీజన్లో హిందీ, ఇంగ్లీష్‌కు అడ్డే లేకుండా పోయింది. ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. సోమవారం ఎపిసోడ్లో శ్వేత వర్మ ఆంగ్ల దండకం అందుకుంది. ఆమె కోపంలో ఉన్నా సరే ఒక్కసారి అయినా హెచ్చరించి ఉండాలి కదా. ఉమా, లోబో బూతులు మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఎందుకు ఊరుకున్నాడు. ఎందుకు వారిని ఒక్కసారి కూడా హెచ్చరించలేదు అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఉమా మొదటిసారి మాట్లాడినప్పుడు హెచ్చరించి ఉంటే.. రెండోసారి అలా మాట్లాడేది కాదు కదా? అని వాదిస్తున్నారు. ఈ యాక్షన్స్పై శనివారం నాగార్జున రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. అసలు వీళ్లని ఎక్కడి నుంచి తెచ్చారు బాబో అంటూ ఆటపట్టిస్తున్నారు. నాగార్జున గారు ఎలిమినేట్ దెమ్ ఇమీడియట్లీ అంటూ సెటైర్లు వేస్తున్నారు.