విజయ రామారావు.. ఐపీఎస్ అధికారిగా ఎన్నో కీలక బాధ్యతలు, పదవులు నిర్వర్తించారు. అటు రాజకీయ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్రం విడిపోయాక తెలుగుదేశం పార్టీని వీడి.. టీఆర్ఎస్ లో చేరారు.
సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి విజయ రామారావు(85) కన్నుమూశారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న విజయ రామారావు సోమవారం రాత్రి 7 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. విజయనగరం జిల్లా ఏటూరు నాగారంలో జన్మించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. మద్రాస్ యూనివర్సిటీలో బీఏ పూర్తి చేసిన ఆయన.. 1958లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో లెక్టరర్ గా చేరారు. ఆ తర్వాత 1959లో సివిల్స్ కు ఎంపికయ్యారు.
1959 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన విజయ రామారావు వివిధ హోదాల్లో పనిచేశారు. 1984 సంక్షోభం సమయంలో హైదరాబాద్ కమిషనర్ గా విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత సీబీఐ డెరెక్టర్ గా కూడా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో బాబ్రీ మసీదు కేసు, ముంబయి పేలుళ్లు, హవాలా కుంభకోణం వంటి ఎన్నో కీలక కేసుల దర్యాప్తులు చేపట్టారు. సర్వీసులో ఉండగానే విజయరామారావు ఎల్ఎల్బీ పూర్తి చేశారు. పదవీ విరమణ తర్వాత పోలీసు మాన్యువల్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. తెలుగు దేశం పార్టీ తరఫున 1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు. రోడ్లు- భవనాల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయరామారావు టీఆర్ఎస్ లో చేరారు. విజయ రామారావు మృతిపట్ల రాజకీయ నేతలు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.