అంతరిక్షంలోకి వెళ్లేంతగా అభివృద్ధి సాధించినందుకు ఆనందపడాలో.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా అభివృద్ధికి ఆమడదూరంలో ఆగిపోయిన పల్లెలను, పరిస్థితులను చూసి బాధపడాలో అర్థం కానీ పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న మహనీయులు.. ఒకప్పుడు వీధి లైట్ల కింద కూర్చుని చదువుకున్నారని తెలిసి.. ఆశ్చర్యపోయాం. అయితే స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్నప్పటికి.. నేటికి కూడా మన సమాజంలో వీధి లైట్ల కింద చదువుకుంటూ తమ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న విద్యార్థులున్నారంటే.. ఆశ్చర్యం కాదు.. సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి.
నేటికి కూడా మన దేశంలో కొన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదంటే.. మరి మనం అభివృద్ధి చెందడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందో అర్థం కావడం లేదు. ప్రజలకు కనీస మౌళిక సౌకర్యాలు కల్పించలేని నాయకులు, ప్రభుత్వాలు.. వారిని గట్టిగా నిలదీయలేని పిరికపంద ప్రజలున్నన్ని రోజులు పరిస్థితులు ఇలానే ఉంటాయి. తాజాగా మన దేశంలో పేదలు ఎలాంటి దుర్భర పరిస్తితులు ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టే వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
స్ట్యూట్స్ జోన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ రోజు మొత్తం మీద మంచి వీడియో అనే క్యాప్షన్‌తో ఓ వీడియోని పోస్ట్ చేశారు.. ఇది ఎక్కడ జరిగింది అని తెలియడం లేదు కానీ.. ఈ వీడియోలో ఓ బాలిక.. ఫుట్‌పాత్ మీద కూర్చుని.. దీక్షగా వీధిలైట్ల వెలుగులో హోం వర్క్ పూర్తి చేసుకుంటుంది. వాహనాల రాకపోకలతో.. విపరీతమైన శబ్దాలతో ఎంతో గందరగోళంగా ఉన్న ఆ వాతావరణంలో.. బాలిక మాత్రం ఎంతో దీక్షగా హోం వర్క్ చేసుకుంటూ ఉండటం వీడియోలో చూడవచ్చు. ప్రసుత్తం ఈ వీడియో తెగ వైరలవుతోంది. వేల మంది దీన్ని లైక్ చేశారు.
ఈ వీడియో చూసిన తర్వాత నెటిజనులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బాలిక ఏకాగ్రతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం.. అన్ని సౌకర్యాలు కల్పించి.. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసినా.. చదువుకోవాలంటే బద్దకించే పిల్లలు ఎందరో ఉన్నారు.. కానీ ఈ చిన్నారి మాత్రం.. ఫుట్‌పాత్ మీద కూర్చుని ఇంత దీక్షగా చదువుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కామెంట్ చేయగా.. మరి కొందరు నెటిజనులు.. ఇలాంటి వాళ్లు దేశ అభివృద్ధికి కూడా పాటుపడతారు.. ఆ చిన్నారి అడ్రెస్ ఇస్తే.. ఆమె చదువుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తాం అంటున్నారు. కొందరు నెటిజనులు మాత్రం.. ఈ వీడియోలో.. ఆ బాలిక పట్టుదల, అంకిత భావాన్నే కాక.. నేటికి కూడా దేశంలో ఎలాంటి దుర్భర పరిస్థితులున్నాయో ఎత్తి చూపుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోపై ఎవరైనా స్పందించి.. బాలికను ఆదుకుంటారేమో చూడాలి.