వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి మరణంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని అంటూ సామాన్య జనం నుంచి రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.
సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. మత్తును కలిగించే లీతల్ ఇంజెక్షన్ తీసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకున్న ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆదివారం కన్నుమూసింది. ప్రీతి మృతి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రీతి మరణానికి కారణమైన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని సామాన్య జనం దగ్గరి నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ స్పందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమన్నారు.
ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవర్మణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదనను తలుచుకుంటే హృదయం ద్రవించిందని అన్నారు. కాలేజీ సకాలంలో స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు స్పందించకపోవటంపై సోషల్ మీడియా వ్యాప్తంగా మండిపాటు వ్యక్తం అవుతోంది. ఎక్స్‌గ్రేషియా ప్రకటన సందర్భంలో మంత్రి ఎర్ర బెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఈ ఘటనపై స్పందించారని చెప్పారు. కానీ, సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ, స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. దీనిపై ఎలాంటి ట్వీట్లు కూడా పెట్టలేదు.
రాష్ట్రంలో ఇంత విషాదకరమైన ఘటన జరిగితే.. ముఖ్యమంత్రి స్పందించకపోవటం ఏంటని నెటిజన్లు అంటున్నారు. బాలుడిపై కుక్క దాడి ఘటనపై స్పందించిన కేటీఆర్.. ఓ డాక్టర్ యువతి చనిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. సీనియర్ వేధింపులకు బలైన ప్రీతి ప్రాణాలకు విలువ లేదా అని నిగ్గదీస్తున్నారు. మహిళా నేతగా కవిత ఓ ఆడపిల్ల మరణంపై స్పందించాల్సిన బాధ్యత లేదా అని అంటున్నారు. కాగా, ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం కన్ను మూసింది. ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు అంబులెన్స్‌లో ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన జనగాం జిల్లాలోని గిర్నీతండాకు తరలించారు. మరి, ప్రీతి మరణంపై కేసీఆర్, కేటీఆర్, కవితలు స్పందించకపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.