పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతానికి చాలా గడ్డు కాలం నడుస్తోందని చెప్పొచ్చు. టాస్ వేసేందుకు కొన్ని నిమిషాల ముందు న్యూజిల్యాండ్ పర్యటనను రద్దు చేసుకోని వెళ్లడం ఆ బోర్డుపై తీవ్ర ప్రభావమే చూపింది. ఆదాయం విషయం పక్కనబెడితే.. ఆ దేశంలోని భద్రతా పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుంతుందని వారు భయపడినట్లే వెంటనే ఇంగ్లాండ్ కూడా వారి పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశాలపై పాకిస్థాన్ క్రికెట్ మాజీలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెళ్లగక్కారు. ఈ సందర్భంగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు కూడా కాస్త వివాదాస్పదమయ్యాయి. రానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో తమ టార్గెట్ ఆ మూడు దేశాలేనంటూ బాహాటంగానే ప్రకటన చేశాడు. ‘ఇప్పటివరకు మా టార్గెట్ భారత్ మాత్రమే ఇక నుంచి ఆ జాబితాలోకి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ కూడా చేరాయి’ అని రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలను ఆ దేశ జట్టు ఎంతవరకు కాపాడగలదు అనే చర్చ మొదలైంది.
పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ వంటి వారి వ్యాఖ్యలు, ప్రగల్భాలు, ఇప్పటివరకు వారు చేసిన సవాళ్లు అన్నింటిని నిలబెట్టుకోవాల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాకిస్థాన్ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ కంటే ఆ మూడు దేశాలపై గెలవడమే ముఖ్యంగా కనిపిస్తోంది. అదే ముఖ్యం కూడా. ఏ దేశంపై గెలిచినా.. ఏ దేశం చేతిలో ఓడారు అన్నది ముఖ్యం కాదు. టార్గెట్ లిస్ట్‌లో ఉన్న దేశాలను ఓడించారా? లేదా? మొత్తం ఆ జట్టు దృష్టంతా దానిపైనే ఉన్నట్లు తెలుస్తోంది. వారు ప్రకటనలు చూసినా అదే అర్థమవుతుంది.
ఇప్పటివరకు అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 179 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజామ్.. 8551 పరుగులు చేశాడు. అన్ని ఫార్మట్లలోనూ సెంచరీ చేసిన బాబర్ ముఖ్యంగా టీ20ల్లో 46.89 బ్యాటింగ్ సగటు, 130.65 స్ట్రైక్ రేట్ వంటి మంచి స్టాటిస్టిక్స్తోనే ఉన్నాడు. కానీ ఆ లెక్కలు ఇప్పుడు ఎంత వరకు ఉపయోగపడతాయన్నదే సందేహం. బాబర్ ఆజామ్ ఎప్పుడూ టీమిండియా మీద రాణించింది లేదు. భారత బౌలర్లు బాబర్ ఎంతో సులువుగానే ఔట్ చేయగలరు. కౌంటీలు ఆడుతూ టీ20 వరల్డ్ కప్ కోసం బాబర్ బాగానే సన్నద్ధం అవుతున్నాడు.
బాబర్ ఎంత వరకు ప్రభావం చూపిస్తాడు.. పాకిస్థాన్ మాజీలు, క్రికెట్ బోర్డు పరువు నిలబెడతాడా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.