మంచు మనోజ్ కి ఎప్పటి నుంచో పాలిటిక్స్ లోకి రావాలన్న ఆసక్తి ఉంది. సమాజానికి ఏదో ఒకటి చేయాలని తాపత్రయం ఉంది. అయితే సరైన సమయం కోసం ఆగుతూ వచ్చారు మనోజ్. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఆ సమయం రానే వచ్చిందేమో అనిపిస్తోంది. మంచు మనోజ్ త్వరలోనే ఓ రాజకీయ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో చాలా సందర్భాల్లో సామాజిక అంశాలపై మాట్లాడారు. ఒకానొక సమయంలో మీడియా బాధ్యత ఏంటో గుర్తుచేశారు. సాయి ధరమ్ తేజ్ కి యాక్సిడెంట్ అయిన సమయంలోనే సింగరేణిలో ఓ బాలిక మీద అత్యాచారం జరిగింది. అయితే మీడియా కేవలం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ని మాత్రమే ఫోకస్ చేస్తే.. మనోజ్ బాలికకు జరిగిన అన్యాయాన్ని కవర్ చేయండి అంటూ విజ్ఞప్తి చేశారు.
అలా మంచు మనోజ్ సామాజిక బాధ్యత కలిగిన హీరోగా ఇంకో మెట్టు ఎక్కేశారు. పలు సందర్భాల్లో తన పొలిటికల్ ఇంట్రస్ట్ ని కూడా బయటపెట్టారు. అయితే ఆ మధ్య మా ఎలక్షన్స్ నేపథ్యంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ దీని మీద మనోజ్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఆయన టీడీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మంచు మనోజ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 2019లో ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మనోజ్ సింగిల్ గానే ఉన్నారు. అయితే ఆయన టీడీపీ పార్టీ నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డితో లవ్ లో ఉన్నారని, త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని మంచు మనోజ్ అన్నారు. అంతేకాదు పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా అప్పుడే చెబుతానని అన్నారు. దీంతో మంచు మనోజ్ టీడీపీలో చేరతారని వార్తలు ఊపందుకున్నాయి. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో గెలవడమంటే ఆషామాషీ కాదు. ఎప్పుడూ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలుస్తూ వచ్చారు. కాంగ్రెస్ తర్వాత వైసీపీ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నారు. 1978లో చంద్రబాబు గెలిచారు. మళ్ళీ 83లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో చంద్రగిరినొదిలి కుప్పం వెళ్లిపోయారు. 1978 నుండి టీడీపీ తరపున గెలిచిన ఒక్క అభ్యర్థి లేరు. అలాంటిది ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా మంచు మనోజ్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి.
చంద్రగిరి నియోజకవర్గం అంటే వైసీపీకి కంచుకోట. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్ట్రాంగ్ క్యాండిడేట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోటీ చేసి గెలవడం అంటే అంత చిన్న విషయమేమీ కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రగిరిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన చేపట్టినన్ని కార్యక్రమాలు మరే నాయకుడు చేపట్టలేదు. రీసెంట్ గా పర్యావరణ హితమే లక్ష్యంగా వినాయక చవితి సందర్భంగా 1 లక్షా 24 వేల బంక మట్టి విగ్రహాలను తయారు చేయించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో ఈయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం లభించింది. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే తిరుగు లేదు.
అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద గెలవాలంటే కష్టమే. మరి టీడీపీ తరపున మంచు మనోజ్, చంద్రగిరిలో పోటీ చేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ మంచు మనోజ్ ఇప్పటి వరకూ పొలిటికల్ ఎంట్రీ గురించి గానీ, పలానా పార్టీ మీద ఇంట్రస్ట్ ఉందన్న విషయం గానీ వెల్లడించలేదు. మరోవైపు మంచు మోహన్ బాబు కూడా 2024 ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై మంచు ఫ్యామిలీ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ ఒకవేళ మంచు వారు పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తే ఈ గేమ్ లో గెలుస్తారా? లేదా? అనేది చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.