ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణ పార్థివ దేహానికి బాలకృష్ణ నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు భార్య, కూతురితో కలిసి వెళ్లారు. అక్కడ కృష్ణ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. కొద్ది సేపు వారితో మాట్లాడి ఓదార్చారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కృష్ణగారు డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్. ఆయన మన మధ్య లేరన్నది నమ్మలేని నిజం. మొదటినుంచి కూడా ఆయన సినిమా రంగంలో సాహసాలకు, సంచలనాలకు మారు పేరు. చలన చిత్ర రంగానికి ఆయన ఎనలేని సేవలు చేశారు.
మొదటి కౌబాయ్ సినిమా.. మొదటి స్టీరియో స్కోప్ సినిమా.. మొదటి 70 ఎమ్‌ఎమ్ సినిమా, మొదటి డీటీఎస్ సౌండ్ సిస్టమ్ సినిమాను ఆయనే పరిచయం చేశారు. సినిమాల్లో ఏ టెక్నిక్ వచ్చినా.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశ పెట్టారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. పద్మాలయ స్టూడియోస్‌ను నిర్మించి ఎన్నో మహాత్తరమైన సినిమాలు తీయటం జరిగింది. అన్ని రకాల సినిమాల్లో ఆయన నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేవలం చిత్ర పరిశ్రమను మాత్రమే కాదు.. మొత్తం అభిమానుల్ని కూడా శోక సంద్రంలో ముంచి వెళ్లిపోయారు. ఈ భూమ్మీద ఎంతో మంది పుడతారు, గిడతారు.. ఓ మనిషి విజయ పథంలోకి నడవాలంటే.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే.. సత్సంకల్పం కావాలి, అకుంటిత దీక్ష బూనాలి.
నీ దారిలో నువ్వు నడవాలి అంటారు. ఈ మూడు కృష్ణ గారిలో ఉన్నాయి. ఆయన నిర్మాతల పాలిట కల్ప తరువు, కల్ప వృక్షం. నాన్న గారికి, ఆయనకు చాలా విషయాల్లో సారూప్యం ఉంది. నిర్మాతల కోసం ఎన్నో చేశారు. పారితోషికం తగ్గించుకున్నారు. ఆర్థికంగా సహాయం చేశారు. సుల్తాన్ సినిమాలో ఇద్దరం కలిసి నటించాము. నాన్న గారి గురించి తెలుసుకుందామని అడిగేవాడ్ని. ఆయన నాన్న గారి గురించి చెప్పేవారు. బుర్రిపాలెంలో సినిమాలకు వెళ్లటం. నాన్న గారి సినిమా థియేటర్‌లో మొదటి ఆటకే చూడటానికి వెళ్లి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినటం గురించి చెప్పేవారు. తనకు నాన్న గారే స్పూర్తి అని చాలా సార్లు చెప్పారు. కృష్ణ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.