హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. తనకు తానుగా సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించుకుని ఓ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా, బద్వేలుకు చెందిన డాక్టర్ రాజ్‌కుమార్(29).. అమీర్‌పేట శ్యామ్‌కరణ్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. రాజ్ కుమార్ బీకేగూడలోని రెంట్ హౌస్ లో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే.. శుక్రవారం తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి తన మనసు బాగోలేదంటూ కాసేపు ఫోన్ లో మాట్లాడాడు. తర్వాత కాసేపటికి ఫ్రెండ్ తిరిగి కాల్ చేసేసరికి రాజ్ కుమార్ రెస్పాండ్ అవ్వలేదు.
దీంతో రాజ్ కుమార్ పై అనుమానం వచ్చిన ఫ్రెండ్.. మరో డాక్టర్ శ్రీకాంత్ సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన శ్రీకాంత్.. హుటాహుటిన రాజ్ కుమార్ రూమ్ కి వచ్చి చూడగా.. అతను చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే రాజ్ కుమార్ ని హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం రాజ్ కుమార్ తండ్రి కొండిపల్లి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సెలైన్ బాటిల్ లో విషం ఎక్కించుకుని రాజ్ కుమార్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరి రాజ్ కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అతనికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.