అతి వేగం ప్రాణాలు తీస్తుందని తెలిసి కూడా కొంతమంది హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. సరదా కోసమో… జనం ముందు తాము హీరోలము అని నిరూపించటం కోసమో కొంత మంది వాహనాలతో విన్యాసాలు చేస్తున్నారు. ముఖ్యంగా బైక్‌లపై స్టంట్లు చేయటం ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. పలు ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో చట్ట విరుద్ధంగా బైక్ స్టంట్లు, రైడింగ్ పోటీలు నిర్వహించటం మామూలైపోయింది. ఇవే వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా, ఓ ఇద్దరు యువకులు బైకు స్పీడు టెస్టు చేస్తూ ప్రాణాలు విడిచారు. అది కూడా స్పీడు టెస్ట్ నిర్వహిస్తూ వీడియో తీస్తున్న సమయంలోనే ఈ దారుణం జరిగింది. రోడ్డుపై ఎగిరిపడి ఇద్దరూ మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని చెన్నైకి చెందిన ప్రవీణ్, హరి స్నేహితులు. ప్రవీణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా.. హరి ఇంటర్ ముగించుకుని డిగ్రీలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ప్రవీణ్ తల్లిదండ్రులు అతడికి ఓ స్పోర్ట్స్ మోటార్ బైక్ కొనిపించారు. ఈ నేపథ్యంలోనే బైక్ స్పీడ్ టెస్ట్ చేయటానికి ఓఎమ్ఆర్ రోడ్డు మీదకు వచ్చారు. హరి బైకు నడుపుతుండగా.. ప్రవీణ్ వీడియో తీస్తూ ఉన్నాడు. బైక్ కొద్ది కొద్దిగా వేగాన్ని పెంచుకుంటూ రోడ్డుపై దూసుకుపోతోంది. చివరగా 114 కిలోమీటర్ల వేగంతో వెళ్లసాగింది. అప్పుడు వారి ముందుకు ఓ మినీ వ్యాన్ వచ్చింది. దాన్ని చూడగానే హరి బైక్ స్పీడు ఠక్కున తగ్గించాడు. ఆ వెంటనే బైకును పక్కకు తిప్పాడు.
దీంతో అది వెళ్లి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. వారు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. రక్తం ఓడుతున్న వీరిని అక్కడివారు రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వారు మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం వారి బైక్ స్పీడ్ టెస్టుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ అతి సర్వత్రా వర్జయేత్’’.. ‘‘ నిండు జీవితం 23 సెకన్లలో ముగిసిపోయింది’’.. ‘‘ నేను నా కారును 90కి మించి నడపను. అలాంటిది వారు 110పైనే నడిపారు. మంచిది వాళ్లు రోడ్డున పోయే వాళ్లను చంపలేదు’’.. ‘‘ అతడు చివరి మాటగా అమ్మా అని అరిచాడు’’.. ‘‘ ప్రాణాలు పోవాలని రాసిపెట్టున్నపుడు దారుణంగా ఇలా రోడ్డుపై చావాల్సి వస్తుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Two bike riders who were taking a videograph while riding a two-wheeler in 114 km/hr speed were killed after they skidded off the bike on Taramani – Velachery link road near SRP Tools junction.#accident #roadaccident #TaramaniVelacherylink #SRPtools #instagram #Chennai pic.twitter.com/SeHbdsOKUm
— DT Next (@dt_next) December 1, 2022