Inter Student: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను కాదందన్న కోపంతో ఓ యువకుడు ఇంటర్ విద్యార్థినిపై ఘాతుకానికి ఒడిగట్టాడు. అప్పుడే పరీక్ష రాసి ఇంటికి బయలుదేరిన అమ్మాయిపై కత్తితో దాడి చేశాడు. 14 పోట్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు… తమిళనాడు, తిరుచ్చికి చెందిన ఓ బాలిక అక్కడి ఓ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సదరు బాలికను అదే ప్రాంతానికి చెందిన కేశవన్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. తనను ప్రేమించాలంటూ ఆమె వెంటపడుతున్నాడు. ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. 2021 సంవత్సరంలో ఓ సారి బాలికను కిడ్నాప్ చేశాడు. పోలీసులు అతడ్ని వెతికిపట్టుకుని బాలికను రక్షించారు.
అతడు కటకటాలపాలయ్యాడు. అయితే, జైలు పాలైనప్పటికి అతడి బుద్ధి మారలేదు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాతినుంచి మళ్లీ వేధింపులు మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కూడా వేధింపులకు దిగాడు. ఆమె అతని ప్రేమను కాదని తెగేసి చెప్పింది. సాయంత్రం పరీక్ష రాసి ఇంటికి బయలు దేరిన బాలికను అడ్డగించాడు. తన ప్రేమను అంగీకరించాలని బెదిరించాడు. దీంతో బాలిక కాదని మరో సారి గట్టిగా చెప్పింది. బాలిక కాదనేసరికి కేశవన్ విచక్షణ కోల్పోయాడు. కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. 14 సార్లు కసితీరా పొడిచాడు.
బాలిక అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. ఆ వెంటనే నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు బాలికను తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం స్టాలీన్ దీనిపై స్పందిస్తూ.. దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు. అలాంటి ఉన్మాదులను వెంటనే శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Grama Volunteer: మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ అఘాయిత్యం.. మూడు నెలలుగా..