సికింద్రాబాద్‌లోని రామ్ గోపాల్ పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ పేట్‌లోని డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం 11 గంటల సమయంలో ఆరు అంతస్తుల భవనం కింది భాగంలో ఉన్న కార్ల విడి భాగాల గోదాంలో షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలో మంటలు మొదలయ్యాయి. ఆ మంటలు కొద్ది సేపటి తర్వాత భవనం పై అంతస్తులో ఉన్న స్పోర్ట్స్ షోరూంకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగ, మంటలు రావటం మొదలైంది. మంటల్ని గుర్తించిన కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి వచ్చిన ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి.
అయితే, మంటలు అదుపులోకి రాలేదు. పక్కనే ఉన్న బట్టల షాపులోకి వ్యాపించాయి. అందులో ఉన్న జనం పొగ, మంటల కారణంగా లోపలే ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫైర్ సిబ్బంది అతికష్టం మీద వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. మంటలు మొదలై దాదాపు 5 గంటలు దాటినా కూడా పరిస్థితి అదుపులోకి రావటం లేదు. పొగలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది సైతం అస్వస్థతకు గురవుతున్నారు. ఓ ఇద్దరు ఫైర్ సిబ్బందిని ఇప్పటికే అస్పత్రికి తరలించారు. అదుపులోకి రాని మంటలు పక్క భవనాలకు సైతం వ్యాపిస్తున్నాయి. ఓ వైపు మంటల్ని ఆర్పుతుంటే మరో వైపు చెలరేగుతున్నాయి. దీంతో మంటల్ని ఆర్పటం కష్ట సాధ్యంగా మారింది.
దీంతో కెమికల్స్ సహాయంతో మంటల్ని ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంటలు ఆర్పడానికి మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ చీఫ్ విశ్వజిత్ మాట్లాడుతూ.. భవనం దగ్గరకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేదన్నారు. అందుకే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతోందని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా చుట్టు పక్కలి వారిని ఖాళీ చేయిస్తున్నామని అన్నారు. అవసరం అయితే బిల్డింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.